Headlines

వివాదంగా మారుతున్న కూతురు వ్యవహారం.. టీపీసీసీ నోటీసుపై మంత్రి కొండా సురేఖ ఘాటు వివరణ! | Minister Konda Surekha’s TPCC Explanation: Daughter’s Controversial Remarks on CM Revanth Reddy Political Row


టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుపై తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన వివరణతో కూడిన లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి గురువారం (ఆగస్టు 20) పంపించారు. నోటీసుకు దారితీసిన అంశాలపై తన వైఖరిని లేఖలో స్పష్టంగా వివరించిన మంత్రి.. తన ప్రమేయం లేని అంశానికి తనను బాధ్యురాలిగా చేయడం సముచితం కాదని పేర్కొన్నారు.

తన జన్మదినోత్సవం సందర్భంగా ఆగస్టు 19న రాష్ట్రవ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారని సురేఖ తెలిపారు. జన్మదిన వేడుకలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు వివరించారు. తన స్వస్థలమైన గీసుకొండతో తన కుమార్తె కొండా సుస్మితా పటేల్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఈ కారణంగా అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.

అయితే ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని కొండా సురేఖ స్పష్టం చేశారు. కుమార్తె వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని భావించడం సముచితం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.అదే విధంగా, తన కుమార్తె చేసిన వ్యాఖ్యల ఆధారంగా తనను వివరణ కోరడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను రాజకీయ బాధ్యతతో ముడిపెట్టడం సరికాదని వివరించారు. ఈ అంశంలో తన పాత్ర లేదా ప్రమేయం లేదని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని కొండా సురేఖ స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలు, క్రమశిక్షణ, ప్రజాస్వామ్య విలువలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో క్రమశిక్షణా కమిటీ తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తానని ఆమె తెలిపారు. వాస్తవ పరిస్థితులను, ప్రజాస్వామ్య విలువలను పరిగణనలోకి తీసుకుని ఈ అంశాన్ని పరిశీలించాలని మంత్రి కమిటీని కోరారు. తన ప్రమేయం లేని విషయానికి సంబంధించి తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

Minister Konda Surekha Letter

Minister Konda Surekha Letter

కొండా సుస్మితా పటేల్ ఎమన్నారంటే..?

మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆగస్టు 19న మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో భాగంగా గీసుకొండలో నిర్వహించిన కార్యక్రమంలో సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రేవూరినే అభ్యర్థిగా ప్రకటించడం సరికాదంటూనే.. పరకాలలో పోటీ చేసేది గెలిచేది తానేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపై చేసిన ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాలను అలానే.. కాంగ్రెస్ పార్టీని షేక్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే రేవూరిపై సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. దీంతో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసు జారీ చేసింది.

కాగా తాజాగా మంత్రి ఇచ్చిన వివరణతో ఈ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నోటీసుపై సురేఖ వివరణ అనంతరం కమిటీ స్పందనపై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *