భోపాల్, ఆగస్ట్ 30: కల్పనా మరణానికి కొద్దిసేపటి ముందు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె తీవ్ర ఆందోళనతో ఏడుస్తూ, కేకలు వేస్తూ కనిపించారు. ‘ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాగే చికిత్స కొనసాగితే వీళ్లు నన్ను చంపేస్తారు. నేను బతకను. దయచేసి నన్ను కాపాడండి.. నా ప్రాణాలకు ప్రమాదం ఉంది’ అంటూ ఆమె తన తల్లిని వేడుకున్నట్లు వీడియోలో వినిపిస్తోంది. మహిళల వార్డులో కల్పనా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, నర్సింగ్ సిబ్బంది ఆమెను ఆపేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. ఓ దశలో సిబ్బంది ఆమెను ‘నీకు పిచ్చి పట్టిందా?’ అని అడగడం కూడా వీడియోలో వినిపిస్తోంది. అయితే కల్పనా తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ, తనకు సరైన చికిత్స అందడం లేదని ఆరోపించడం వీడియోలో చూడొచ్చు.
అసలేం జరిగిందంటే..?
రేవా జిల్లాలోని హత్వా ప్రాంతానికి చెందిన కల్పనా మిశ్రాకు ఇది తొలి కాన్పు. ఆగస్టు 25 రాత్రి కల్పనకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను ప్రసవం కోసం సమీపంలోని సంజయ్ గాంధీ-గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆగస్టు 26 రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ఆమెకు సిజేరియన్ నిర్వహించగా, పండంటి బిడ్డ జన్మించింది. అయితే ప్రసవం అనంతరం కొద్దిసేపటికే కల్పనా, నవజాత శిశువు ఇద్దరూ మృతి చెందారు. ఈ మరణాలకు దారితీసిన పరిస్థితులపైనే ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కల్పనా తండ్రి రామ్‌శరణ్ మిశ్రా తన కుమార్తె పరిస్థితి విషమిస్తున్న విషయాన్ని వైద్యులకు పలుమార్లు తెలియజేసినా తగినంత శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. ‘కల్పనా నాకు ఒక్కగానొక్క కుమార్తె. ఆమె పెళ్లి కోసం రూ.15 లక్షల విలువైన భూమిని అమ్మాను. ఇప్పుడు ఆమె మమ్మల్ని విడిచిపోయింది. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. విధుల్లో ఉన్న వైద్యుడు, సిబ్బందిని సస్పెండ్ చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అనుమతించబోమని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
అనస్థీషియాపైనా అనుమానాలు
కల్పనా కుటుంబ సభ్యులు మరో తీవ్రమైన ఆరోపణ చేశారు. సిజేరియన్ సమయంలో అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఆమె తిరిగి స్పృహలోకి రాలేదని తెలిపారు. అనస్థీషియా మోతాదు ఎక్కువగా ఉండటం కూడా మరణానికి కారణమై ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద బైఠాయించి వైద్యుల నిర్లక్ష్యంపై ఆందోళన చేపట్టారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆస్పత్రి డీన్ డాక్టర్ సునీల్ అగర్వాల్, సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ మిశ్రా అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో చర్చించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన చర్చల అనంతరం జిల్లా ఆస్పత్రి వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబం అంగీకరించింది.
“Mom, please save me… I won’t survive, they will kill me.” This was reportedly the last video of 9-month pregnant Kalpana Mishra at Rewa’s Sanjay Gandhi Hospital. Hours later, both her unborn baby and she tragically died. 💔 pic.twitter.com/v72sp8GTP6
— NEUTRAL INDIA (@_neutralindia) August 29, 2026
ఇద్దరు నర్సింగ్ అధికారుల సస్పెన్షన్
ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం ప్రాథమిక చర్యలు చేపట్టింది. విధుల్లో ఉన్న సాధనా వర్మ, సీమా ముజాల్డే అనే ఇద్దరు నర్సింగ్ అధికారులను ప్రాథమిక ఆధారాల ఆధారంగా సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మరోవైపు వైద్యుల నిర్లక్ష్యం ఆరోపణలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ మిశ్రా ఖండించారు. కల్పనకు వైద్య ప్రోటోకాల్స్ ప్రకారమే చికిత్స అందించామని, వైద్యుల వైపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. డీన్ డాక్టర్ సునీల్ అగర్వాల్ మాట్లాడుతూ.. తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందడం అత్యంత విషాదకర ఘటన అని, కుటుంబం చేసిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరుగుతోందని తెలిపారు. కల్పన ఎందుకు స్పృహలోకి రాలేకపోయారనే అంశం కూడా దర్యాప్తులో భాగంగా తెలుసుకుని, బాధ్యులిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సిబ్బంది కొరతను కూడా మరోసారి తెరపైకి తెచ్చింది. 2025-26 అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 5,443 స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు మంజూరు కాగా, వాటిలో కేవలం 1,495 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 3,948 పోస్టులు ఖాళీగా ఉండగా.. 72 శాతానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా 6,513 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు గాను 2,689 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మంజూరైన మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో 40 శాతానికి పైగా ఖాళీగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.