Headlines

సరిహద్దు గేట్లు బద్దలు.. యూరప్‌లోకి వేలాది మంది వలసదారుల చొరబాటు.. స్పెయిన్‌లో హై అలర్ట్! | High Alert in Europe: Spain sending troops as thousands enter enclave of Ceuta from Morocco

సరిహద్దు గేట్లు బద్దలు.. యూరప్‌లోకి వేలాది మంది వలసదారుల చొరబాటు.. స్పెయిన్‌లో హై అలర్ట్! | High Alert in Europe: Spain sending troops as thousands enter enclave of Ceuta from Morocco


స్పెయిన్‌కు చెందిన చిన్న భూభాగం సెయుటాలో భారీ వలస ఉద్రిక్తతలకు దారి తీసింది. మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు ఒక్కసారిగా సరిహద్దు దాటి సెయుటాలోకి ప్రవేశించడంతో అక్కడి పరిస్థితి అదుపు తప్పింది. సరిహద్దు వద్ద పరిస్థితి పూర్తిగా కుప్పకూలిపోయిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు అదనపు బలగాలు, సైన్యాన్ని మోహరించాలని స్పెయిన్ ప్రభుత్వాన్ని కోరారు.

గురువారం (జూలై 30) ఉదయం ఉత్తర మొరాకోలోని తారాజల్ సరిహద్దు ప్రాంతం వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అనంతరం వారిలో చాలామంది సరిహద్దు దాటి సెయుటాలోకి ప్రవేశించారు. వీరిలో ఎక్కువగా యువకులు ఉన్నప్పటికీ, మహిళలు, చిన్నారులతో కూడిన కుటుంబాలు కూడా కనిపించాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో వలసదారులు తీర ప్రాంతం నుంచి నగర రహదారుల వైపు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.

“పరిస్థితి పూర్తిగా గందరగోళంగా మారింది” అని సరిహద్దు భద్రతా సిబ్బంది ప్రతినిధులు తెలిపారు. వేలాది మంది ఒకేసారి సరిహద్దు దాటడంతో భద్రతా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని వెల్లడించారు. అయితే ఈ ప్రవాహానికి అసలు కారణం ఏమిటనేది స్పష్టంగా తెలియలేదు. స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాత్రం దేశ సరిహద్దుల రక్షణ, ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు మొరాకో అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించింది. అక్రమంగా ప్రవేశించిన వారిని తిరిగి పంపించే ప్రక్రియపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపింది.

మరోవైపు, గత కొద్ది రోజులుగా సముద్ర మార్గంలో సెయుటాకు చేరుకునే ప్రయత్నాలు కూడా పెరిగాయి. ఈ క్రమంలో సముద్ర మార్గంలో జరిగిన ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సెయుటా యూరప్‌లోకి ప్రవేశించేందుకు ఆఫ్రికా నుంచి వచ్చే వలసదారులకు కీలక మార్గంగా మారింది. మెరుగైన జీవితం, ఆర్థిక అవకాశాల కోసం, స్వదేశాల్లోని హింస నుంచి తప్పించుకునేందుకు అనేక మంది ఈ ప్రమాదకర ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి 2021లోనూ చోటుచేసుకుంది. అప్పట్లో కేవలం రెండు రోజుల్లోనే 8 వేల మందికి పైగా వలసదారులు సెయుటాలోకి చేరడంతో పెద్ద స్థాయి సంక్షోభం ఏర్పడింది. తాజాగా జరిగిన పరిణామాలు మరోసారి ఆ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి.

సెయుటా ప్రాంతీయ ప్రభుత్వం అధిపతి జువాన్ జీసస్ వివాస్ జాతీయ భద్రత దృష్ట్యా అత్యవసర చర్యలు తీసుకోవాలని కోరారు. సరిహద్దు భద్రత కోసం మరిన్ని పోలీసులు, సైనిక బలగాలను పంపాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సెయుటాలో సహాయక కేంద్రాలు వలసదారులతో నిండిపోగా, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *