Headlines

సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ! అసలు మ్యాటర్ ఏంటంటే..? | PepsiCo vs Farmers: Supreme Court to Decide Rights Over FL 2027 Potato Used in Lay’s Chips

సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ! అసలు మ్యాటర్ ఏంటంటే..? | PepsiCo vs Farmers: Supreme Court to Decide Rights Over FL 2027 Potato Used in Lay’s Chips


లేస్ చిప్స్ తయారీలో ఉపయోగించే ప్రత్యేక బంగాళాదుంప రకం FL 2027 (FC5)పై న్యాయ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు కేవలం ఒక బంగాళాదుంప రకం గురించే కాకుండా, కార్పొరేట్ సంస్థల మేధో సంపత్తి హక్కులు, రైతుల విత్తన హక్కులు మధ్య జరుగుతున్న కీలక పోరుగా మారింది. ఈ వివాదానికి కేంద్ర బిందువైన FL 2027 బంగాళాదుంప రకాన్ని చిప్స్, వేఫర్స్ తయారీ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ఇందులో తేమ శాతం తక్కువగా ఉండటంతో చిప్స్ కరకరలాడేలా తయారవుతాయి. అయితే ఇది సాధారణ వంట అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగించే రకం కాదు.

ఈ రకాన్ని తామే అభివృద్ధి చేశామని, మొక్కల రకాల పరిరక్షణ, రైతుల హక్కుల చట్టం 2001 ప్రకారం దీనిపై తమకే ప్రత్యేక హక్కులు ఉన్నాయని పెప్సికో వాదిస్తోంది. 2016లో పొందిన రిజిస్ట్రేషన్ ప్రకారం, ఈ రకాన్ని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, మార్కెట్ చేయడం వంటి హక్కులు తమకే చెందుతాయని, అనుమతి లేకుండా ఎవరూ దీనిని సాగు చేయకూడదని కంపెనీ పేర్కొంది.

అయితే రైతు సంఘాలు ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సెక్షన్ 39(1)(iv) ప్రకారం రైతులకు విత్తనాలను పండించడం, నిల్వ చేసుకోవడం, మార్పిడి చేసుకోవడం, విక్రయించడం వంటి హక్కులు చట్టబద్ధంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. రైతులు వాటిని బ్రాండెడ్ విత్తనాలుగా విక్రయించనంత వరకు ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగదని పిటిషనర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పెప్సికో మాత్రం తాము సాధారణ చిన్న రైతులపై చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. తమ అనుమతి లేకుండా ఈ రకాన్ని వాణిజ్యపరంగా సాగు చేసి ప్రత్యర్థి చిప్స్ కంపెనీలకు సరఫరా చేస్తున్న సందర్భాల్లో మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

ఈ కేసులో రైతు సంఘాలు మరో కీలక అంశాన్ని కూడా లేవనెత్తాయి. ఆహార పంటలపై కార్పొరేట్ సంస్థలకు పూర్తి నియంత్రణ ఇవ్వడం భారత వ్యవసాయ వ్యవస్థకు, రైతుల జీవనోపాధికి ప్రమాదకరమని వాదించాయి. మరోవైపు, కొత్త విత్తన రకాలను అభివృద్ధి చేసే సంస్థలకు చట్టబద్ధమైన రక్షణ అవసరమని పెప్సికో అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో పెప్సికో బ్రీడర్ హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలా? లేక రైతుల విత్తన హక్కులను కాపాడాలా? అనే కీలక ప్రశ్నకు సుప్రీంకోర్టు తీర్పు భవిష్యత్తులో భారత వ్యవసాయం, విత్తన పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *