Headlines

సెల్ఫీ కోసమని వెళ్లి.. ఏడాది కూతురిని యమునా నదిలోకి విసిరేసిన తండ్రి! చితకబాదిన జనాలు


సెల్ఫీ కోసమని వెళ్లి.. ఏడాది కూతురిని యమునా నదిలోకి విసిరేసిన తండ్రి! చితకబాదిన జనాలు

ఆగ్రా, ఆగస్ట్‌ 16: ఏడాది వయసున్న కుమార్తెతో సెల్ఫీ తీసుకుంటానని చెప్పిన ఓ వ్యక్తి.. వంతెనపైకి వెళ్లి అక్కడి నుంచి చిన్నారిని యమునా నదిలోకి విసిరేశాడు. అనంతరం తన భార్యను కూడా నదిలోకి తోసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన ఆగ్రాలోని సికందరా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న అకబరా యమునా బ్రిడ్జిపై బుధవారం చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకు, అతని భార్య లక్ష్మి తమ ఏడాది కుమార్తెతో కలిసి మోటార్‌సైకిల్‌పై ఆగ్రా నగరానికి బయలుదేరారు. మార్గమధ్యలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అకబరా యమునా వంతెన వద్ద రింకు బైక్‌ను ఆపి.. కుమార్తెతో సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నానని భార్యకు చెప్పాడు. అనంతరం చిన్నారిని తీసుకుని వంతెన రెయిలింగ్‌ వద్దకు వెళ్లి ఫొటో తీసుకున్నాడు. ఆ తర్వాత చిన్నారిని యమునా నదిలోకి విసిరేశాడు. తన భర్తను అడ్డుకునేందుకు లక్ష్మి పరుగెత్తగా.. రింకు ఆమెను కూడా వంతెనపై నుంచి నదిలోకి తోసేందుకు ప్రయత్నించాడు.

ఆమె కేకలు వేయడంతో అక్కడికి ప్రయాణికులు, స్థానికులు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని లక్ష్మి వారికి చెప్పడంతో ఆగ్రహించిన కొందరు రింకును పట్టుకుని చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లక్ష్మి ఫిర్యాదు మేరకు సికందరా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు చిన్నారి కోసం పీఏసీ (Provincial Armed Constabulary) డైవర్లు యమునా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీ లభించలేదు. ఘటనకు గల పూర్తి కారణాలు, దంపతుల మధ్య జరిగిన వివాదానికి సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *