అమరాతి, ఆగస్ట్ 16: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనను మరింత మెరుగుపరిచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల (విద్యా వాలంటీర్లు) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను కొంతవరకు అధిగమించి విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 6,534 విద్యా వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 3,597 సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులు, 2,937 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
నెలకు వేతనం ఎంతంటే?
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలవారీ గౌరవ వేతనం చెల్లించనున్నారు. SGT (Secondary Grade Teacher) పోస్టులకు నెలకు రూ.10,000, School Assistant పోస్టులకు నెలకు రూ.12,500 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఈ నియామకాలు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కాకుండా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లుగా సేవలు అందించే విధంగా ఉంటాయి. తగిన విద్యార్హతలు, ఇతర అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆగస్టు 21, 2026వ తేదీలోగా తమ దరఖాస్తులను సంబంధిత మండల విద్యాశాఖాధికారి (MEO) కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా చేపట్టనున్నట్లు నోటిఫికేషన్‌లో విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 1 నుంచే విధుల్లోకి.. నో ఎగ్జామ్!
మెరిట్ ఆధారంగా ఎంపికైన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో సేవలు అందించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు వారు విధులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకాలను చేపడుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. పోస్టుల వారీగా విద్యార్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ఫార్మాట్ తదితర పూర్తి వివరాలను అభ్యర్థులు సంబంధిత అధికారుల నుంచి తెలుసుకోవాలి.