Headlines

1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు! అన్నం పెట్టిన బండిని బాగు చేసి.. | Farmer Reunites With Grandfather’s 1953 Tractor After 62 Years, Restores It to Its Original Glory

1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు! అన్నం పెట్టిన బండిని బాగు చేసి.. | Farmer Reunites With Grandfather’s 1953 Tractor After 62 Years, Restores It to Its Original Glory


ఒకప్పుడు కుటుంబ వ్యవసాయానికి వెన్నెముకలా నిలిచిన ట్రాక్టర్.. కాలగమనంలో యజమానులు మారి కనుమరుగైంది. కానీ ఆ ట్రాక్టర్‌పై ఉన్న అనుబంధం మాత్రం కుటుంబ సభ్యుల మనసుల్లో అలాగే నిలిచిపోయింది. చివరకు 62 ఏళ్ల తర్వాత అదే ట్రాక్టర్‌ను వెతికి పట్టుకుని, దానిని తిరిగి కొనుగోలు చేసి పూర్వ వైభవానికి తీసుకువచ్చిన ఓ రైతు మనవడి కథ ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.

అమెరికాకు చెందిన రైతు కెవిన్ క్లాన్ తాతగారు 1953లో ఆలిస్-చాల్మర్స్ WD (Allis-Chalmers WD) ట్రాక్టర్‌ను అప్పట్లో 2,200 డాలర్లకు కొనుగోలు చేశారు. ఆ రోజుల్లో అది వారి కుటుంబ వ్యవసాయానికి ఎంతో విలువైన పెట్టుబడిగా నిలిచింది. ఎన్నో సంవత్సరాల పాటు అదే ట్రాక్టర్‌తో పొలాలు దున్ని, పంటలు పండించి కుటుంబ జీవనాధారంగా ఉపయోగించుకున్నారు. కాలక్రమంలో ఆ ట్రాక్టర్‌ను విక్రయించాల్సి వచ్చింది. తర్వాత అది పలువురు యజమానుల చేతులు మారుతూ చివరకు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే తాత ఉపయోగించిన ఆ ట్రాక్టర్‌ను మళ్లీ కనుగొనాలన్న కోరిక కెవిన్ క్లాన్‌ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది.

Vintage Tractor Family Heri

ఫొటో: పాత ట్రాక్టర్‌ను బాగా చేసిన తర్వాత..

ఎన్నో సంవత్సరాల అన్వేషణ తర్వాత, చివరకు 2015లో ఆ ట్రాక్టర్‌ను గుర్తించాడు. అసలు కొనుగోలు జరిగిన 62 ఏళ్ల తర్వాత దానిని తిరిగి కొనుగోలు చేశాడు. అప్పటికే ట్రాక్టర్ పూర్తిగా పాడైపోయినా, దానిని ఒక పాత యంత్రంగా కాకుండా కుటుంబ చరిత్రలో భాగంగా భావించాడు. ఆ తర్వాత ట్రాక్టర్‌ను పూర్తిగా పునరుద్ధరించే పనిని ప్రారంభించాడు. అసలు రూపాన్ని, రంగును, యాంత్రిక నిర్మాణాన్ని సాధ్యమైనంత వరకు అలాగే ఉంచేలా ఎంతో ఓర్పుతో మరమ్మతులు చేశాడు. నెలల తరబడి శ్రమించి చివరకు ట్రాక్టర్‌కు మళ్లీ కొత్త జీవం పోశాడు.

ప్రస్తుతం ఆ ట్రాక్టర్ కేవలం పాత వ్యవసాయ యంత్రం మాత్రమే కాదు.. మూడు తరాలను కలిపే కుటుంబ వారసత్వానికి ప్రతీకగా నిలిచింది. వ్యవసాయ కుటుంబాలకు ట్రాక్టర్లు కేవలం పనిముట్లు మాత్రమే కాకుండా, ఎన్నో జ్ఞాపకాలకు సాక్ష్యాలుగా ఉంటాయని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. పాత యంత్రాలను సంరక్షించడం అంటే కేవలం ఇనుమును కాపాడటం కాదు.. వాటితో ముడిపడిన కుటుంబ కథలను, విలువలను, భావోద్వేగాలను భవిష్యత్ తరాలకు అందించడమని కెవిన్ క్లాన్ నిరూపించాడు. 70 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ట్రాక్టర్ ఇప్పుడు కుటుంబ వారసత్వాన్ని సజీవంగా నిలబెట్టిన అమూల్యమైన జ్ఞాపకంగా మారింది. ఈ కథ ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *