Ishant Sharma: భారత మాజీ పేసర్ ఇశాంత్ శర్మ 1988 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కుడిచేతి ఫాస్ట్ బౌలర్ 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2008 ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ టెస్టులో అతని బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఆ ప్రదర్శనతో భవిష్యత్తులో జహీర్ ఖాన్ వారసుడిగా ఎదుగుతాడనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తర్వాత వేగం తగ్గడంతో ఫామ్ కోల్పోయాడు. సెలెక్టర్లు అతని పనిభారాన్ని తగ్గించినా ఇబ్బందులు కొనసాగాయి. 2013లో 50 టెస్టులు పూర్తి చేసే సమయానికి అతని గణాంకాలు ఆశించిన స్థాయిలో లేవు. అయినా తర్వాత రీఎంట్రీ చేసి కీలక మ్యాచ్‌ల్లో ప్రభావం చూపించాడు. ముఖ్యంగా 2014 లార్డ్స్ టెస్టులో కెరీర్లోనే అత్యుత్తమంగా 7/74 నమోదు చేసి భారత్ విజయానికి ప్రధాన కారణమయ్యాడు.
లార్డ్స్‌లో మరపురాని ప్రదర్శన..: ఇశాంత్ కెరీర్లో 2014 లార్డ్స్ టెస్టు ప్రత్యేక అధ్యాయం. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో అతను 7 వికెట్లు పడగొట్టి భారత్‌కు 95 పరుగుల విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కెరీర్లో అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే.
ఆ తర్వాత 2015 శ్రీలంక పర్యటనలోనూ ఇశాంత్ కీలకంగా నిలిచాడు. కొలంబోలోని ఎస్ఎస్సీ వేదికగా జరిగిన టెస్టులో 8 వికెట్లు సాధించి, టెస్టు క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
కెరీర్లో మరో మంచి దశ..: 2018లో ఇంగ్లాండ్ పర్యటన ఇశాంత్‌కు మరో ముఖ్యమైన దశగా నిలిచింది. ఆ 5 టెస్టుల సిరీస్‌లో అతను 18 వికెట్లు తీసి భారత బౌలింగ్ విభాగంలో అత్యధిక ప్రభావం చూపిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఇంగ్లాండ్‌లో భారత బౌలర్‌గా 43 టెస్టు వికెట్లతో కపిల్‌దేవ్ రికార్డును సమం చేశాడు.
పేస్ తగ్గిన దశను దాటి, మళ్లీ తన అనుభవం, లైన్-లెంగ్త్‌తో ప్రభావం చూపడం ఇశాంత్ కెరీర్లో చెప్పుకోదగ్గ అంశం. 2008లో పెర్త్‌లో వెలుగులోకి వచ్చిన పేసర్.. లార్డ్స్‌లో మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో తన స్థాయిని మరోసారి చాటాడు.




