Headlines

9వ తరగతి విద్యార్థులకు రూ.20 లక్షల వరకు SBI స్కాలర్‌షిప్‌.. వెంటనే దరఖాస్తు చేయండి | SBI Platinum Jubilee Asha Scholarship 2026 27 Announced for Students, Get Financial Support Up to Rs 20 Lakh

9వ తరగతి విద్యార్థులకు రూ.20 లక్షల వరకు SBI స్కాలర్‌షిప్‌.. వెంటనే దరఖాస్తు చేయండి | SBI Platinum Jubilee Asha Scholarship 2026 27 Announced for Students, Get Financial Support Up to Rs 20 Lakh


ఆర్థికంగా వెనుకబడిన కానీ చదువులో ప్రతిభ కనబరిచే నిరుపేద విద్యార్థులకు SBI ఫౌండేషన్ (SBI Foundation) స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించేందుకు ‘ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2026 (SBI Platinum Jubilee Asha Scholarship 2026)’ పేరుతో దేశవ్యాప్తంగా స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది మొత్తం 25,707 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు ఎస్‌బీఐ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ పథకం అమలుకు రూ.100 కోట్ల నిధులు కేటాయించింది. అర్హత కలిగిన విద్యార్థులు 2026 సెప్టెంబర్ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ స్కాలర్‌షిప్ పథకం ద్వారా 9వ తరగతి విద్యార్థుల నుంచి విదేశీ ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల వరకు వివిధ విభాగాల్లో ఆర్థిక సహాయం అందించనుంది. ఈ స్కాలర్‌షిప్‌లో అర్హత కలిగిన విద్యార్థులకు కోర్సును బట్టి రూ.15,000 నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. పాఠశాల, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఐఐటీ, ఐఐఎం విద్యార్థులతో పాటు విదేశీ విద్య అభ్యసించే విద్యార్థులకు కూడా ప్రత్యేక కేటగిరీలు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత కేటగిరీకి నిర్దేశించిన విద్యార్హతలు, కనీస మార్కులు/సీజీపీఏ మరియు కుటుంబ ఆదాయ పరిమితిని తప్పనిసరిగా పూర్తి చేయాలి. పాఠశాల విద్యార్థులకు వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల లోపు, ఉన్నత విద్య కేటగిరీలకు సాధారణంగా రూ.6 లక్షల లోపు ఉండాలి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఈ స్కాలర్‌షిప్‌కు కింది విభాగాల విద్యార్థులు అర్హులు.

  • 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు
  • అండర్ గ్రాడ్యుయేషన్ (UG) విద్యార్థులు
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) విద్యార్థులు
  • మెడికల్ విద్యార్థులు
  • ఐఐటీ (IIT) విద్యార్థులు
  • ఐఐఎం (IIM) విద్యార్థులు
  • విదేశాల్లో (Overseas) ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు

దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. విద్యార్థులు అధికారిక పోర్టల్‌లో నమోదు చేసుకుని, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తును సమర్పించాలి. స్కాలర్‌షిప్‌కు ఎంపికైన వారి ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తారు. ఎంపిక ప్రక్రియలో అకడమిక్ ప్రతిభ, ఆర్థిక పరిస్థితి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 2026–27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ జూలై 22, 2026 నుంచే ప్రారంభమైంది. అర్హత కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 4, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని SBI ఫౌండేషన్ సూచించింది.

ఎంపిక ఎలా జరుగుతుంది?

దరఖాస్తులను పరిశీలించిన అనంతరం విద్యార్థుల విద్యా ప్రతిభ (Academic Performance), ఆర్థిక పరిస్థితి (Financial Background) ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత తుది ఎంపిక చేపడతారు. ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ మంచి అవకాశంగా నిలవనుంది. అర్హులైన విద్యార్థులు గడువు ముగియకముందే దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ ఫౌండేషన్ సూచించింది.

SBI ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *