Headlines

Kokila Vrat: మంచి భర్త కావాలా? భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటున్నారా? అయితే ఈ కోకిల వ్రతం ఆచరించండి..! | Kokila Vrat: Date, Puja Timings, Mythological Story and Religious Significance for Married and Unmarried Women

Kokila Vrat: మంచి భర్త కావాలా? భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటున్నారా? అయితే ఈ కోకిల వ్రతం ఆచరించండి..! | Kokila Vrat: Date, Puja Timings, Mythological Story and Religious Significance for Married and Unmarried Women


Kokila Vrat Telugu: ఆషాఢ మాస పౌర్ణమి రోజున ఆచరించే ‘కోకిల వ్రతం’ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ముఖ్యంగా ‘వివాహిత మహిళలు’ ‘వివాహ యోగ్య వయస్సులో ఉన్న యువతులు’ ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల వైవాహిక జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని, భర్తకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే, అవివాహిత యువతులు మంచి జీవిత భాగస్వామి లభించాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున ‘శివపార్వతులను పూజించడం’ అత్యంత శుభప్రదంగా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కోకిల వ్రతాన్ని ఆషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకు నెల రోజుల పాటు నియమ నిష్ఠలతో పాటించే సంప్రదాయం కూడా ఉంది. మరి 2026లో కోకిల వ్రతం ఎప్పుడు? పూజా ముహూర్తం ఏమిటి? ఈ వ్రతం వెనుక ఉన్న పౌరాణిక కథ, మతపరమైన విశిష్టత ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

2026లో కోకిల వ్రతం ఎప్పుడు?

దృక్ పంచాంగం ప్రకారం, ఆషాఢ పౌర్ణమి 2026 జూలై 28, మంగళవారం సాయంత్రం 6:18 గంటలకు ప్రారంభమై, జూలై 29, బుధవారం రాత్రి 8:05 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం 2026 జూలై 28, మంగళవారం కోకిల వ్రతాన్ని ఆచరించడం శుభప్రదంగా భావిస్తారు.

కోకిల వ్రతం 2026 పూజా ముహూర్తం

కోకిల వ్రతం రోజున ప్రదోష కాలంలో శివపార్వతులను పూజించడం అత్యంత మంగళకరంగా పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి



  • తేదీ: 28 జూలై 2026 (మంగళవారం)
  • ప్రదోష పూజా సమయం: సాయంత్రం 7:15 గంటల నుంచి రాత్రి 9:20 గంటల వరకు
  • మొత్తం వ్యవధి: 2 గంటల 5 నిమిషాలు

ఈ శుభ సమయంలో శివపార్వతులను పూజించి, తమ కోరికలను ప్రార్థిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.

కోకిల వ్రతం వెనుక ఉన్న పౌరాణిక కథ

కోకిల వ్రతానికి సంబంధించిన ప్రసిద్ధ కథ పార్వతీ దేవితో ముడిపడి ఉంది. పురాణాల ప్రకారం, ఒక శాపం కారణంగా పార్వతీ దేవి కొంతకాలం కోకిల (కోయిల) రూపంలో జీవించాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా ఆమె తన భర్తగా పరమశివుడినే పొందాలనే సంకల్పంతో కఠోర తపస్సు చేసింది. కోకిల రూపంలో ఉన్నప్పటికీ, శివునిపై తన భక్తిని విడిచిపెట్టకుండా నిరంతరం తపస్సు చేసిన పార్వతీదేవి భక్తికి ప్రసన్నుడైన పరమశివుడు ప్రత్యక్షమై, ఆమెను శాప విముక్తురాలిని చేశాడు. అనంతరం ఆమె తన అసలు రూపాన్ని తిరిగి పొంది, పరమశివుడిని వివాహం చేసుకుంది. ఈ సంఘటనకు గుర్తుగా ఈ వ్రతాన్ని ‘కోకిల వ్రతం’ అని పిలుస్తారని విశ్వాసం.

అవివాహిత యువతులకు కోకిల వ్రతం ఎందుకు ప్రత్యేకం?

వివాహ యోగ్య వయస్సులో ఉన్న యువతులు ఈ వ్రతాన్ని ఎంతో భక్తితో ఆచరిస్తారు. శివపార్వతులను పూజించడం ద్వారా తాము కోరుకున్న మంచి, సద్గుణాలు కలిగిన జీవిత భాగస్వామి లభిస్తారని నమ్మకం ఉంది. హిందూ సంప్రదాయంలో శివుడు ఆదర్శ భర్తగా, పార్వతీ దేవి ఆదర్శ భార్యగా భావించబడతారు. అందుకే యువతులు తమ భవిష్యత్ వైవాహిక జీవితం ఆనందంగా, అన్యోన్యంగా సాగాలని ఈ వ్రతం సందర్భంగా ప్రార్థిస్తారు.

వివాహిత మహిళలకు కోకిల వ్రతం ప్రాముఖ్యత

వివాహిత మహిళలకు కోకిల వ్రతానికి మరింత విశిష్టమైన స్థానం ఉంది. ఈ రోజున వారు తమ భర్తల దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, కుటుంబంలో శాంతి, సుఖసంతోషాలు, అన్యోన్యత కోసం శివపార్వతులను ప్రార్థిస్తారు. పార్వతీ దేవి కఠోర తపస్సుతో శివుడిని పొందినట్లే, ఆమెను స్మరిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలోని ఆటంకాలు తొలగి, దాంపత్య బంధం మరింత బలపడుతుందని భక్తుల విశ్వాసం.

(Disclaimer: కోకిల వ్రతానికి సంబంధించిన ఆచారాలు, పూజా విధానాలు ప్రాంతానుసారం మారవచ్చు. స్థానిక సంప్రదాయాలు లేదా కుటుంబ ఆచారాలను అనుసరించి వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరం. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *