Headlines

మరింత సేఫ్‌గా రైల్వే సేవలు.. కొత్త డిజిటల్ యాప్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే మరి | Southern Railway Launches Three Digital Apps: Enhancing Train Safety and Operational Efficiency!

మరింత సేఫ్‌గా రైల్వే సేవలు.. కొత్త డిజిటల్ యాప్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే మరి | Southern Railway Launches Three Digital Apps: Enhancing Train Safety and Operational Efficiency!


చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో ప్రారంభించిన e-TSR, RBMS, DOST యాప్‌లు రోజువారీ కార్యకలాపాలను పూర్తిగా డిజిటల్ రూపంలోకి మార్చనున్నాయి. సిగ్నల్ రికార్డుల నమోదు నుంచి ట్రాక్‌పై పనిచేసే ఉద్యోగుల ప్రాణ రక్షణ వరకు అన్ని విభాగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న ఈ డిజిటల్ సేవల పూర్తి వివరాలను తెలుసుకుందాం!

మూడు డిజిటల్ యాప్‌లు

రైలు సేవలను మరింత సురక్షితంగా, వేగవంతంగా మార్చే దిశగా రైల్వే కీలక అడుగు వేసింది. రైల్వే సిబ్బంది పనిని సులభతరం చేయడంతో పాటు భద్రతను పెంచే లక్ష్యంతో సౌత్ రైల్వే మూడు కొత్త డిజిటల్ యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి పూర్తిగా రైల్వే అవసరాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు. వీటిలో e-TSR (Electronic Train Signal Register), RBMS (Railway Block Management System), DOST (Delivering Occupational Safety on Track) ఉన్నాయి.

ఈ మూడు అప్లికేషన్లను తాజాగా చెన్నైలో దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ యాప్‌లు రోజువారీ కార్యకలాపాల్లో కీలకమైన పనులను పూర్తిగా డిజిటల్ రూపంలోకి తీసుకువస్తాయి. రైలు సిగ్నల్ రికార్డులు రికార్డు చేయడం, ట్రాక్ మెయింటెనెన్స్ కోసం బ్లాక్‌లు ఇవ్వడం, వాటిని పర్యవేక్షించడం, అలాగే ట్రాక్‌పై పనిచేసే ఉద్యోగుల భద్రతను మెరుగుపరచడం లాంటి పనుల్లో ఇవి ఉపయోగపడతాయి.

e-TSR, RBMS యాప్‌ల విశేషాలు

ఇప్పటి వరకు అనేక స్టేషన్లలో రైలు సిగ్నల్ వివరాలను కాగితాలపై రికార్డు చేసే విధానం అమల్లో ఉంది. ఇప్పుడు e-TSR ద్వారా ఆ విధానానికి బదులుగా సురక్షితమైన ఎలక్ట్రానిక్ రిజిస్టర్‌ను ఉపయోగించనున్నారు. రైళ్ల కదలికలకు సంబంధించిన సమాచారం డేటా లాగర్ ద్వారా ఆటోమేటిక్‌గా నమోదు అవుతుంది. టైమ్ వివరాలు కూడా ఆటోమేటిక్‌గా నమోదవుతాయి. దీంతో మానవ తప్పిదాలు తగ్గడమే కాకుండా, టైమ్ మరింత ఆదా అవుతుంది. ఈ యాప్ వల్ల స్టేషన్ మాస్టర్ల పని కూడా మరింత సులభం కానుంది.

ప్రతి రైలుకు సంబంధించిన వివరాలను పేపర్ మీద రాయాల్సిన అవసరం తగ్గడంతో వారు రైళ్ల నిర్వహణపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రయాణికులకు కూడా మెరుగైన సేవలు అందించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక RBMS యాప్ ట్రాక్ నిర్వహణ కోసం అవసరమైన రైల్వే బ్లాక్‌లను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తుంది. బ్లాక్ కోసం రిక్వెస్ట్ పంపడం నుంచి, అనుమతి ఇవ్వడం, వినియోగం, అవసరమైతే పొడిగించడం, చివరికి ముగించడం వరకు మొత్తం ప్రక్రియ ఒకే ప్లాట్‌ఫారమ్‌లో జరుగుతుంది.

ఉద్యోగుల భద్రత కోసం ‘దోస్త్’ (DOST) యాప్

మరో ముఖ్యమైన యాప్ DOST. ఇది ట్రాక్‌లపై, వాటి సమీపంలో పనిచేసే సిబ్బంది భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ యాప్ రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ నుంచి రైళ్ల కదలికలను ప్రత్యక్షంగా గుర్తించి, ఉద్యోగుల GPS లొకేషన్‌తో లింక్ చేస్తుంది. రైలు సమీపిస్తే వెంటనే ముందస్తు హెచ్చరికలను పంపుతుంది. ఈ హెచ్చరికలు పసుపు, ఎరుపు రంగుల సూచనలతో పాటు ఆడియో, విజువల్, ఫ్లాష్ లైట్, వైబ్రేషన్ రూపంలో కూడా అందుతాయి.

ట్రాక్‌ల దగ్గర శబ్దం ఎక్కువగా ఉండే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫీచర్లను రూపొందించారు. ఈ మూడు డిజిటల్ యాప్‌లతో రైల్వే కార్యకలాపాలు మరింత స్మార్ట్‌గా మారడంతో పాటు, నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఏర్పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *