Headlines

నల్ల సముద్రంలో నరకం.. ఉక్రెయిన్ పోర్టులో క్షణక్షణం భయంతో వణికిపోతున్న భారతీయులు! | Black Sea Attacks: 13 Indian Sailors Trapped On Ship Near Ukraine port

నల్ల సముద్రంలో నరకం.. ఉక్రెయిన్ పోర్టులో క్షణక్షణం భయంతో వణికిపోతున్న భారతీయులు! | Black Sea Attacks: 13 Indian Sailors Trapped On Ship Near Ukraine port


రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం మరోసారి భారతీయుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. నల్ల సముద్ర తీరంలోని ఉక్రెయిన్‌ చోర్నోమోర్స్‌కీ ఓడరేవులో ఓ సరుకు రవాణా నౌకలో 13 మంది భారతీయ నావికులు సహా 15 మంది సిబ్బంది చిక్కుకున్నట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) వెల్లడించింది. ఓడరేవు పరిసరాల్లో కొనసాగుతున్న డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో సిబ్బంది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని నావికుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

FSUI ప్రకారం, ‘ఎంవీ అమీర్-1’ అనే వాణిజ్య నౌక ప్రస్తుతం చోర్నోమోర్స్‌కీ పోర్టులో నిలిచిపోయింది. నౌకకు సమీప ప్రాంతాల్లో వరుసగా డ్రోన్, క్షిపణి దాడుల ముప్పు కొనసాగుతోందని, ఏ క్షణంలోనైనా ప్రత్యక్ష దాడి జరిగే ప్రమాదం ఉందని సంఘం తెలిపింది. సిబ్బంది తీవ్ర భయాందోళనల మధ్య రోజులు గడుపుతున్నారని పేర్కొంది. నౌకలో చిక్కుకున్న భారతీయ నావికుల భద్రతను వెంటనే నిర్ధారించాలని, వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని FSUI భారత ప్రభుత్వం, నౌక యజమానులు, నౌక జెండా దేశ అధికారులు, సంబంధిత సంస్థలను కోరింది. సంఘర్షణ ప్రాంతాల్లో పనిచేస్తున్న భారతీయ నావికులను రక్షణ లేకుండా వదిలేయరాదని విజ్ఞప్తి చేసింది.

సిబ్బంది పరిస్థితిని తెలియజేస్తూ నావికుల సంఘం ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో నౌక చుట్టుపక్కల ప్రాంతంలో పొగలు కమ్ముకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓడరేవు పరిసరాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఈ దృశ్యాలు ప్రతిబింబిస్తున్నాయని సంఘం పేర్కొంది.

ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, సంబంధిత షిప్పింగ్ కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే పరిస్థితిని భారత అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇటీవలి కాలంలో నల్ల సముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడుల ఘటనలు పెరుగుతున్నాయి. గత వారం నల్ల సముద్రంలో జరిగిన ఓ వాణిజ్య నౌక దాడిలో భారతీయ నావికుడు మరణించిన ఘటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌చుక్‌ను భారత విదేశాంగ శాఖ పిలిపించి నిరసన తెలిపింది.

వాణిజ్య నౌకలపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో సముద్ర మార్గాల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న వేళ, చోర్నోమోర్స్‌కీ పోర్టులో చిక్కుకున్న భారతీయ నావికుల రక్షణ ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంపై తదుపరి చర్యల కోసం కుటుంబాలు, నావికుల సంఘాలు ఎదురుచూస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *