Headlines

UPI Payments: యూపీఐ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. రూ.2 వేలు దాటితే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం సంచలన నిర్ణయం.. | UPI and RuPay Payments May Soon Attract MDR Charges for Large Merchants

UPI Payments: యూపీఐ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. రూ.2 వేలు దాటితే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం సంచలన నిర్ణయం.. | UPI and RuPay Payments May Soon Attract MDR Charges for Large Merchants


దేశంలో డిజిటల్ విప్లవానికి బాటలు వేసిన యూపీఐ (UPI), రూపే (RuPay) లావాదేవీలపై త్వరలో అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తాజా సవరణ బిల్లుతో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) చార్జీల వసూలుకు మార్గం సుగమం అవుతుంది. ఈ నిర్ణయం ఎవరిపై ప్రభావం చూపుతుంది? ఆర్థిక శాఖ ప్రతిపాదనల వివరాలు ఇక్కడ చూద్దాం.

దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగాన్ని ఊపేస్తున్న యూపీఐ లావాదేవీలపై మళ్లీ ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR) విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ‘టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026’ లో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేయనుంది. ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007’ లోని సెక్షన్ 10Aకు సవరణ చేయడం ద్వారా పెద్ద వ్యాపారులకు ఇచ్చే బ్యాంక్ ఛార్జీల మినహాయింపును తొలగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

తాజా ప్రతిపాదనల వివరాలు

* రూ. 2,000 దాటితే ఛార్జీలు: రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే UPI, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై దాదాపు “0.5%” వరకు ఎండీఆర్ (MDR) ఛార్జీ పడే అవకాశం ఉంది.

* ఎవరిపై ప్రభావం?: రూ. 50 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి భారీ ఈ-కామర్స్ దిగ్గజాలు, పెద్ద వ్యాపారులకు (Large Merchants) మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి.

* చిన్న వ్యాపారులు, సామాన్యులకు ఊరట: రూ. 2,000 లోపు ఉండే లావాదేవీలకు ఎండీఆర్ నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది.

ఫైనాన్స్ కమిటీ నివేదికలో ప్రతిపాదనలు:

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ ఈ ఏడాది మార్చి నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది:

* లావాదేవీల విలువ: ప్రస్తుతం మొత్తం యూపీఐ చెల్లింపుల విలువలో 67% మేర రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలే ఉన్నాయి.

* భారీ నష్టం: 2021-22 నుంచి 2024-25 వరకు ప్రభుత్వం అందించిన సబ్సిడీ ప్రోత్సాహకాలు డిజిటల్ పేమెంట్ పరిశ్రమ భరించిన నిర్వహణ వ్యయంలో కేవలం 11% మాత్రమే. ఒకవేళ ఎండీఆర్ అనుమతించి ఉంటే వచ్చే రాబడిలో ఇది కేవలం 14%తో సమానం. దీనివల్ల పేమెంట్ సిస్టమ్ కంపెనీలు ప్రాసెసింగ్, సెటిల్‌మెంట్, మౌలిక వసతుల నిర్వహణకు తీవ్రంగా నష్టపోతున్నాయని కమిటీ పేర్కొంది.

* రికార్డు లావాదేవీలు: ఒక్క జూలై నెలలోనే దేశంలో 2,236 కోట్ల UPI లావాదేవీలు జరగ్గా, వాటి విలువ ఏకంగా రూ. 29.88 లక్షల కోట్లుగా నమోదైంది.

చట్టపరమైన మార్పులు ఏంటి?

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్‌లోని సెక్షన్ 10A ప్రకారం RuPay డెబిట్ కార్డులు, BHIM-UPI, UPI-QR కోడ్‌ల ద్వారా జరిగే చెల్లింపులపై బ్యాంకులు లేదా సిస్టమ్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. అయితే, ఆదాయపన్ను చట్టం 1961లోని సెక్షన్ 269SU నిబంధనలకు సవరణలు చేయడం ద్వారా రూ. 50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలపై ఈ మినహాయింపును తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత 2020లో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు MDRను సున్నా చేయగా, ఇప్పుడు వ్యవస్థ సుస్థిరత కోసం పెద్ద వ్యాపారుల నుంచి తిరిగి రుసుములు వసూలు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *