Headlines

Telangana: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. అక్కడ ఏర్పాటుకు రంగం సిద్దం.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. | Warangal to Get Advanced Regional Cancer Hospital; Super Specialty Hospital by Year End

Telangana: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. అక్కడ ఏర్పాటుకు రంగం సిద్దం.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. | Warangal to Get Advanced Regional Cancer Hospital; Super Specialty Hospital by Year End


ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక కేన్సర్ వైద్య సేవలను అందించే విధంగా వరంగల్ రీజనల్ కేన్సర్ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌‌లో మంత్రి కొండా సురేఖతో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష చేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, యశస్విని రెడ్డి, కే‌ఆర్ నాగరాజు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, ఆయా జిల్లాల ఆరోగ్యశాఖ అధికారులు, హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ జనరల్ హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్‌లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. తమ నియోజకవర్గాల్లోని హాస్పిటళ్లలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, హాస్పిటళ్ల బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలను ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. ఎమ్మెల్యేల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని, వారు పేర్కొన్న సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఎంజీఎం హాస్పిటల్‌లో ప్రస్తుతం 29 స్పెషాలిటీల్లో వైద్య సేవలు అందిస్తుండగా, మరో 9 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి సూచించారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు అన్నిరకాల వైద్య సేవలు అందించే హబ్‌గా వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. నిమ్స్ తరహాలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఎల్‌వోసీలు (LOCలు) మంజూరు చేస్తామని, అత్యాధునిక పరికరాలు, అవసరమైన వైద్య నిపుణులు, సిబ్బందితో పూర్తి స్థాయిలో సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జనగామ, నర్సంపేట జనరల్ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీలను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.

హన్మకొండలో ఐవీఎఫ్ సెంటర్‌తో పాటు డ్రగ్ అండ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. రీజనల్ ఐ హాస్పిటల్‌లో అత్యాధునిక కంటి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఎంజీఎం హాస్పిటల్‌కు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను రెగ్యులర్ సూపరింటెండెంట్‌గా నియమిస్తామని ప్రకటించారు. పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్‌పూర్, బచ్చన్నపేట, పాలకుర్తి, కమలాపూర్ ప్రాంతాలకు ఇప్పటికే డయాలసిస్ సెంటర్లు మంజూరు చేశామని, అవసరమైన మౌలిక వసతులు పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరును మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఆఫీసర్‌గా నియమించాలని ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల అవసరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ప్రభుత్వ హాస్పిటళ్లను అన్ని విధాలుగా బలోపేతం చేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు జిల్లా స్థాయిలోనే అందేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు. హెచ్‌ఆర్‌, మౌలిక వసతులు, అత్యాధునిక వైద్య పరికరాలు, మెడిసిన్, డయాగ్నస్టిక్ సేవలను అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో బలోపేతం చేస్తున్నామని తెలిపారు. జిల్లా హాస్పిటళ్లు బలోపేతం కావడం వల్ల హైదరాబాద్‌లోని నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా వంటి ప్రధాన హాస్పిటళ్లపై రోగుల ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *