గ్రీన్ లాండ్ షార్క్: సముద్ర గర్భంలో నివసించే ఈ గ్రీన్ లాండ్ షార్క్ లు దాదాపు 300 నుండి 500 ఏళ్ల వరకు జీవించగలవు. ఇవి శారీరక ఎదుగుదలలో కూడా చాలా నిమ్మదిగా ఉంటాయి. దాదాపు 150 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ఇవి యుక్తవయస్సుకు కూడా చేరుకోవు. చల్లని ఆర్కిటిక్ నీటిలో నివసించడం వల్ల వీటి మెటాబాలిజం చాలా నెమ్మదిగా ఉండటమే వీటి సుదీర్ఘ ఆయుష్షుకు కారణం.
రాక్షస తాబేళ్లు: నేలపై జీవించే జంతువులలో అత్యంత ఎక్కువ కాలం జీవించేది తాబేలే. సీషెల్స్, గాలాపాగోస్ దీవుల్లో కనిపించే ఆల్డాబ్రా రాక్షస తాబేళ్లు సగటున 150 నుంచి 200 ఏళ్ల వరకు జీవిస్తాయి. సెయింట్ హెలీనా దీవిలోని జోనాథన్ అనే తాబేలు దాదాపు 190 ఏళ్లకు పైగా జీవించి ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా రికార్డు సృష్టించింది.
బోహెడ్ తిమింగలం: క్షీరదాల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే జీవి బోహెడ్ తిమింగలం. ఇవి ఆర్కిటిక్ సముద్ర ప్రాంతాల్లో దాదాపు 200 ఏళ్లకు పైగా జీవించగలవు. వీటి శరీరంలో వృద్ధాప్య ప్రక్రియ చాలా నిమ్మదిగా సాగుతుంది.
ఓషన్ క్వాహాగ్: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో లభించే ఈ సిప్పీల సగటు ఆయుష్షు 200 నుండి 500 ఏళ్లు. శాస్త్రవేత్తలు గుర్తించిన మింగ్ అనే ఒక శంఖం వయస్సు దాదాపు 507 సంవత్సరాలు అని తేలింది.
ఇమ్మోర్టల్ జెల్లీఫిష్ : ప్రకృతిలో చావు లేని జీవిగా పిలవబడేది టర్రిటోప్సిస్ డోహర్ని అనే జెల్లీఫిష్. ఇది వయస్సు పెరిగినప్పుడు లేదా ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు, తన కణాలను మళ్లీ చిన్నప్పటి స్థితికి మార్చుకోగలదు. అంటే ఇది సిద్ధాంతపరంగా అమరత్వాన్ని కలిగి ఉంటుంది.




