మన సౌర కుటుంబంలోని అతి అందమైన గ్రహాల్లో శని ఒకటి. దాని చుట్టూ ఉండే అద్భుతమైన వలయాలు మాత్రమే కాదు, శని గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేంటంటే ఒకవేళ శనిగ్రహాన్ని తీసుకొచ్చి నీటిలో వేయగలిగితే, అది నీటిలో మునిగిపోదట.. పైగా తేలుతుందట! ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, దాని వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది.
ఏ వస్తువు అయినా నీటిలో మునగాలా లేదా తేలాలా అనేది దాని సాంద్రత (Density) మీద ఆధారపడి ఉంటుంది. నీటి సాంద్రత ఒక ఘన సెంటీమీటరుకు 1 గ్రాము (1 g/cm³). కానీ శని గ్రహం సగటు సాంద్రత కేవలం 0.687 గ్రాములు (0.687 g/cm³) మాత్రమే. అంటే శని సాంద్రత నీటి కంటే తక్కువ. అందుకే సిద్ధాంతపరంగా చూస్తే శని నీటిలో తేలే అవకాశం ఉంటుంది.
శని ప్రధానంగా హైడ్రోజన్, హీలియం వాయువులతో రూపొందిన ఒక భారీ వాయు గ్రహం. భూమిలా దీనికి గట్టి రాతి ఉపరితలం ఉండదు. తక్కువ సాంద్రత కలిగిన ఈ వాయువులే శని మొత్తం సగటు సాంద్రతను తగ్గిస్తాయి. అందుకే సౌర కుటుంబంలోని ఎనిమిది గ్రహాల్లో శని అత్యంత తక్కువ సాంద్రత కలిగిన గ్రహంగా గుర్తింపు పొందింది. అయితే దీనిని నిజంగా పరీక్షించడం అసాధ్యం. ఎందుకంటే శనిని ముంచేందుకు అవసరమైనంత పెద్ద సముద్రం విశ్వంలో ఎక్కడా లేదు. అంతేకాదు, శని ఒక ఘన వస్తువు కాదు. వాయువులతో కూడిన ఈ భారీ గ్రహాన్ని భూమిపైకి తీసుకురావడం లేదా నీటిలో వేయడం సాధ్యం కాదు.
కాబట్టి శని నీటిలో తేలుతుంది అనేది వాస్తవమే అయినా ప్రయోగంతో నిరూపించిన నిజం కాదు. సాంద్రత అనే శాస్త్రీయ సూత్రాన్ని సులభంగా అర్థం చేసుకునేలా చెప్పే ఒక ఉదాహరణ మాత్రమే. అయినప్పటికీ ఈ ఆసక్తికరమైన విషయం ఖగోళ శాస్త్రంలో శని గ్రహాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఒక గ్రహం నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉండటం నిజంగా విశ్వంలోని అద్భుతాల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి