Headlines

Telangana: ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు పెంపు.. | Telangana RRR Project Delayed Again: NHAI Extends Northern Stretch Tenders for 6th Time

Telangana: ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు పెంపు.. | Telangana RRR Project Delayed Again: NHAI Extends Northern Stretch Tenders for 6th Time


తెలంగాణ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన రీజినల్ రింగ్ రోడ్ పనుల్లో ఆలస్యం కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన ఉత్తర ప్రాంతం టెండర్ల గడువును జాతీయ రహదారుల సంస్థ ఆరోసారి పొడిగించింది. తాజాగా ఈ గడువును ఆగస్టు 20 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 161 కిలోమీటర్ల మేర 6 లేన్లుగా నిర్మించాల్సిన ఈ రహదారికి కేంద్రం తుది అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేయడం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. 2021లోనే ఈ ఉత్తర భాగానికి కేంద్రం ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఆ సమయంలో నాటి ప్రభుత్వం భూసేకరణ వ్యయంలో 50 శాతం నిధులు ఇస్తామని చెప్పింది. ఈ ప్రాజెక్ట్ ఉత్తర భాగానికి మొత్తం 1,918 హెక్టార్ల భూమి అవసరం కాగా, ప్రస్తుతం అధికారుల ప్రకారం అధిక శాతం భూసేకరణ పూర్తయినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా చౌటుప్పల్, ఆమనగల్లు, సంగారెడ్డి మీదుగా వెళ్లే దక్షిణ భాగం రూట్ మార్చడంపై పెద్ద వివాదమే నడిచింది. ఉన్నతాధికారులు, పెద్దల భూములను కాపాడేందుకే రూట్ మార్చారని రైతులు ఆరోపించారు. అయితే ప్రభుత్వం సవరించిన రూట్‌కే ఓకే చెప్పింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, ఉత్తర భాగంలో భూసేకరణ దాదాపు పూర్తయిందని, ఉత్తర, దక్షిణ భాగాల పనులను ఒకేసారి మొదలుపెడితే ఖర్చు తగ్గుతుందని కోరారు.

కేంద్రం ఏం చెప్తోంది?

రాజ్యసభలో రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టత ఇచ్చారు. ఉత్తర భాగానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైందని, దీని అంచనా వ్యయం రూ. 23,935.6 కోట్లు అని తెలిపారు. దీనికి సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్లు, పరిహారం ఇచ్చే ప్రక్రియ చివరి దశకు వచ్చిందని చెప్పారు.

ముందుకు పడేది ఎప్పుడు?

ప్రాజెక్ట్‌కు సంబంధించిన ట్రాఫిక్ అవసరాలు, ఇతర సాంకేతిక వివరాలను పరిశీలించిన తర్వాతే నిధుల కేటాయింపు, నిర్మాణ సమయంపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది. మరోవైపు దక్షిణ భాగానికి సంబంధించిన DPR ఇంకా పూర్తి కావాల్సి ఉంది. దీంతో తెలంగాణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో అనే దానిపై స్పష్టత రావడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *