తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. శ్రీశైలం జలాశయంలో ఈ సీజన్‌లో తొలిసారిగా జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం వైపు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. దీనివల్ల విద్యుత్ సరఫరా పరిస్థితుల్లో కొంతమేర ఊరట లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు స్పిల్‌వే ద్వారా 1,78,464 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 29,357 క్యూసెక్కుల నీరు శ్రీశైలం వైపు వస్తోంది. మొత్తంగా జలాశయానికి 2,07,821 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం వరద నీటితో కళకళలాడుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 873.20 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 155.2652 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే జలాశయం మరింత వేగంగా నిండే అవకాశం ఉంది.
మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం 30,518 క్యూసెక్కుల నీటిని దిగువకు నాగార్జునసాగర్ వైపు విడుదల చేస్తున్నారు. దీంతో ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, మరోవైపు దిగువ ప్రాజెక్టులకు కూడా నీరు చేరుతోంది. అల్పపీడన ప్రభావంతో కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మరింత వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి చేరుతున్న వరద, నీటిమట్టం, నిల్వ సామర్థ్యాన్ని డ్యామ్ అధికారులు, ఇంజనీర్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభం కావడంతో విద్యుత్ ఉత్పత్తి పెరగనుంది. దీంతో ప్రస్తుతం ఉన్న విద్యుత్ డిమాండ్‌ను కొంతమేర తీర్చేందుకు అవకాశం ఏర్పడింది. అయితే దీనిని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇక పూర్తిగా పవర్ కట్‌లు ఉండవని చెప్పడం మాత్రం సరికాదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…