యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు విధించడంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వినియోగదారులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. వ్యాపారులపై కూడా ఎలాంటి భారం ఉండదని తెలిపింది. ఒక నిర్దిష్ట పరిమితికి మించిన కొన్ని వ్యాపార లావాదేవీలకు మాత్రమే నామమాత్రపు రుసుంలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సి అవసరం లేదని కేంద్రం చెప్పుకొచ్చింది. వ్యక్తిగత లావాదేవీలన్నీ ఎప్పటిలాగే ఉచితంగా చేసుకోవచ్చంది. ఈ మేరకు ఆగస్ట్ 8వ తేదీన కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని పరిమిత వ్యాపార లావాదేవీలకు మాత్రమే ఎండీఆర్ ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది.
డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలపై సాధారణంగా విధిస్తున్న ఎండీఆర్ ఛార్జీల కంటే యూపీఐ లావాదేవీలకు కొంతమంది వ్యాపారులకు విధించే రుసుంలు తక్కువగానే ఉంటాయని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. వ్యాపారులకు అత్యధిక యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయంది. ఎండీఆర్ ఛార్జీలను ప్రవేశపెడితే కేవలం పరిమితి ఆధారంగా ఉంటుందని, అందరిపై గుడ్డిగా విధించే అవకాశం ఉండదని క్లారిటీ ఇచ్చింది. అయితే ఎప్పటినుంచి ఎండీఆర్ ఛార్జీలను విధిస్తారనే దానిపై స్పష్టతిచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధ్వర్యంలోని UPI, సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ MDRను ప్రవేశపెట్టాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ ప్రవేశపెడితే ఎలా అనేది ప్రకటిస్తుంది. యూపీఐ చెల్లింపుల్లో తదుపరి దశకు చేరువలో భారత్ ఉందని, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ చెల్లింపుల వ్యవస్థను విస్తరించాలంటే స్వయం సమృద్ది చెందాలని ఆర్థికశాఖ వెల్లడించింది.
పోటీతత్వాన్ని కొనసాగించడానికి, దాని నిరంతర విస్తరణకు మద్దతు ఇవ్వడానికి స్థిరమైన, సరసమైన UPI పర్యావరణ వ్యవస్థ చాలా ముఖ్యమని ఆర్ధిక శాఖ తెలిపింది. చెల్లింపులు, పరిష్కార వ్యవస్థల చట్టానికి ప్రతిపాదించిన సవరణ యూపీఐ సురక్షితంగా, సరసమైనదిగా, సమ్మిళితంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చూసేందుకు ఉద్దేశించబడిందని స్పష్టం చేసింది. కాగా 2016-17లో యూపీఐ వ్యవస్థ ప్రారంభమైంది. దీంతో ఆన్‌లైన్ చెల్లింపుల్లో ఇది ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. జులై 2026లో ఏఖంగా రూ.29.9 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ప్రస్తుతం 11 దేశాల్లో యూపీఐ అమల్లో ఉంది. మరిన్ని దేశాలు యూపీఐతో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొస్తున్నాయి.