సాధారణంగా మనం హోటల్‌కు ఎందుకు వెళ్తాం? వేరే ప్రాంతానికి పనిమీద వెళ్లినప్పుడో, విహారయాత్రకు వెళ్లినప్పుడో బస చేసేందుకు హోటల్‌కు వెళ్తాం. కానీ, మన దేశంలో ఓ ప్రత్యేకమైన హోటల్ ఉంది. అక్కడికి చనిపోవడానికే వెళ్తారు. ఇప్పటి వరకు అలా వెళ్లి ఆ హోటల్‌లో 14 వేల మంది వరకు చనిపోయారు. వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మరి ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వారణాసి.. హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసాల్లో అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటి. జీవిత చివరి రోజులను ఇక్కడ గడిపి, గంగాతీరంలో మరణించి దహన సంస్కారాలు పూర్తయితే మోక్షం లభిస్తుందని హిందూ సంప్రదాయాల్లో ఒక విశ్వాసం ఉంది. ఈ నమ్మకంతోనే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు తమ జీవితపు చివరి రోజులను కాశీలో గడిపేందుకు వస్తుంటారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ప్రదేశమే కాశీ లాభ్ ముక్తి భవన్, సాధారణంగా దీనిని ‘మోక్ష భవన్’ అని పిలుస్తారు.
పునర్జన్మల నుంచి విముక్తి..
హిందూ గ్రంథాలు, సంప్రదాయ విశ్వాసాల ప్రకారం.. ఒక ఆత్మ మానవ జన్మను పొందే ముందు 84 లక్షల యోనుల్లో పునర్జన్మలు ఎత్తుతుందని నమ్ముతారు. మానవ జన్మ లభించిన తర్వాత ఆధ్యాత్మిక సాధన ద్వారా మోక్షాన్ని పొందడం అంతిమ లక్ష్యంగా భావిస్తారు. జనన, జీవితం, మరణం, పునర్జన్మల చక్రం నుంచి విముక్తి పొందడాన్నే మోక్షం లేదా ముక్తిగా పేర్కొంటారు. వారణాసిలో మరణిస్తే, అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తే ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. అందుకే కొందరు తమ జీవితపు చివరి దశను కాశీలోనే గడపాలని నిర్ణయించుకుంటారు.
15 రోజులే సమయం..
ఈ విశ్వాసానికి అనుగుణంగా దాల్మియా కుటుంబం 1958లో మోక్ష భవన్‌ను స్థాపించింది. ఇప్పటి వరకు ఇక్కడ 14 వేల మందికి పైగా తమ చివరి రోజులను గడిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భవన్‌లో కేవలం 10 గదులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడికి వచ్చే వారికి సాధారణంగా 15 రోజుల వరకు ఆశ్రయం కల్పిస్తారు. ఈ సమయంలో వారి ఆరోగ్య పరిస్థితిని సిబ్బంది పర్యవేక్షిస్తారు. 15 రోజుల్లో ఆరోగ్యం మెరుగుపడితే అక్కడి నుంచి వెళ్లాలని సూచిస్తారు. పరిస్థితి అనుకూలంగా లేకపోతే తదుపరి నిర్ణయం తీసుకుంటారు. అవసరమైతే కొంతకాలం తర్వాత తిరిగి రావడానికి కూడా అవకాశం ఉంటుంది.
రూ.20 ఫీజు..
మోక్షం కోసం వచ్చే ఒక్క సాధకుడికి ఒక గది కేటాయిస్తారు. అయితే అతనితో పాటు కుటుంబ సభ్యులు ఉండేందుకు అనుమతి ఉంటుంది. మతపరమైన పరిమితులు లేకుండా ప్రజలు ఇక్కడికి రావచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఆర్థిక స్థోమతను బట్టి విద్యుత్ వినియోగానికి రూ.20 వరకు రుసుము చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి మరణ సమయం ఒకేలా ఉండదు. కొందరు వచ్చిన కొద్దిసేపటికే మరణిస్తే.. మరికొందరు 15 రోజుల వరకు జీవిస్తారు. మోక్షం అనే భావనపై విశ్వాసం ఉన్నవారు తమ జీవిత పరమార్థం నెరవేరిందని భావిస్తారు. కాశీలో మోక్ష భవన్‌తో పాటు ముముక్షు భవన్ వంటి మరికొన్ని ఆశ్రయాలు కూడా ఉన్నాయి. జీవిత చివరి దశను కాశీలో గడపాలనుకునే వారికి ఇవి ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఇక్కడ మరణాన్ని భయంగా కాకుండా ఆధ్యాత్మిక ప్రయాణంలో చివరి ఘట్టంగా చూసే ప్రత్యేకమైన సంప్రదాయం కొనసాగుతోంది.