ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్..! ఇకపై అసెంబ్లీని బయట నుంచి చూడటమే కాదు.. లోపలికి వెళ్లి సందర్శించే బంపర్ ఆఫర్ రాబోతోంది. ప్రజలకు మరింత చేరువగా శాసనసభను తీసుకెళ్లేలా స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా అసెంబ్లీ తలుపులు సామాన్య ప్రజలు, విద్యార్థుల కోసం తెరవనున్నారు. ఆగస్టు 14, 15 తేదీల్లో సాయంత్రం వేళల్లో అసెంబ్లీని ఉచితంగా సందర్శించే అవకాశం కల్పించనున్నారు.
మన సభ – జన సభ
గతంలో ఎన్టీఆర్ చెప్పిన ‘మన సభ – జన సభ’ స్ఫూర్తితో అసెంబ్లీని ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 14, 15 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు, విద్యార్థులు అసెంబ్లీ ప్రాంగణాన్ని సందర్శించవచ్చు. అసెంబ్లీ భవనాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించనున్నారు.
విద్యార్థులకు ప్రత్యేక ఆహ్వానం
స్వాతంత్ర్య పోరాటం, దేశ చరిత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. అవకాశం, సందర్శకుల సంఖ్యను బట్టి అసెంబ్లీ మెయిన్ హాల్‌ను కూడా సందర్శించే అవకాశం కల్పించనున్నారు. అయితే మెయిన్ హాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి ఉండదు.
పోలీస్ బ్యాండ్.. సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రజలను ఆకట్టుకునేలా సాయంత్రం వేళల్లో ప్రత్యేక పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. స్వాతంత్ర్య పోరాటం, త్యాగాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో పరిమితంగా ఫుడ్ కోర్టులకు కూడా అనుమతి ఇచ్చారు.
ప్రతి ఏటా నాలుగు రోజుల పాటు
స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇకపై ప్రతి ఏటా ప్రజలకు అసెంబ్లీ సందర్శన అవకాశం కల్పించాలని నిర్ణయించారు. నాలుగు రోజుల పాటు సామాన్య ప్రజలు, విద్యార్థులు అసెంబ్లీని సందర్శించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే శాసనసభను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నదే లక్ష్యమని స్పీకర్ తెలిపారు.
ప్రజలకు రవాణా సౌకర్యం
సందర్శకుల సంఖ్యను బట్టి రవాణా సౌకర్యాలు కూడా కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు తమ విద్యాసంస్థల బస్సుల్లో వచ్చే అవకాశం ఉండగా.. ఇతర సందర్శకుల కోసం కొన్ని ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..