
ఆగస్టు 12న సంభవించిన పరిపూర్ణ సూర్యగ్రహణాన్ని తిలకించేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆకాశం వైపు చూస్తుండగా, స్పానిష్ ఒలింపిక్ స్కేట్‌బోర్డర్ డానీ లియాన్ ఆ అరుదైన ఖగోళ వింతను ఒక సరికొత్త రీతిలో జరుపుకున్నారు. సూర్యుడికి అడ్డంగా చంద్రుడు వచ్చే అరుదైన సమయానికి అనుగుణంగా ఆయన తన స్కేట్‌బోర్డింగ్ నైపుణ్యాన్ని జోడించి ఒక అద్భుతమైన స్టంట్ చేశారు. దీనిని ఆయన తన జీవితంలోనే అత్యుత్తమ ఫీట్ గా అభివర్ణించారు.
పర్ఫెక్ట్ టైమింగ్… అద్భుతమైన దృశ్యం:
ఈ అరుదైన స్టంట్‌ను చిత్రీకరించడం అంత సులభం కాదు. గ్రహణం, ఖచ్చితమైన సమయం, కాంతి మార్పులు, కెమెరా స్థానం, స్కేట్‌బోర్డర్ జంప్ చేసే సమయం సరిగ్గా సరిపోలాలి. కొన్ని సెకన్ల తేడా వచ్చినా ఈ విజువల్ ఎఫెక్ట్ పాడయ్యే అవకాశం ఉంది. డానీ లియాన్ ఖచ్చితమైన టైమింగ్‌తో గాలిలోకి ఎగిరిన సమయంలో, వెనుక గ్రహణం పట్టిన సూర్యుడు, ముందు డానీ నిలువెత్తు నీడ ఒక అద్భుత చిత్రకళలా కనిపించాయి. ఈ దృశ్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.
విజ్ఞాన శాస్త్రం, క్రీడా ప్రావీణ్యాల అరుదైన కలయిక:
యూరప్, గ్రీన్‌లాండ్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతాలలో స్పష్టంగా కనిపించిన ఈ పరిపూర్ణ సూర్యగ్రహణం 2026 సంవత్సరంలోనే అత్యంత నిరీక్షించిన ఖగోళ సంఘటనలలో ఒకటిగా నిలిచింది. కానీ, డానీ లియాన్ ఈ సమయాన్ని కేవలం సాధారణ స్థితిలో చూసేందుకే కాకుండా, క్రీడా ప్రావీణ్యం, సృజనాత్మకతను కలగలిపి ఒక చిరస్మరణీయ క్షణంగా మార్చుకున్నారు. 23 సెకన్ల ఈ వీడియో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ స్టంట్‌ను ఎక్లిప్స్ మోడ్ జంప్‌గా అభివర్ణించిన డానీ, మంచి విషయాలు ఎప్పుడూ మూడింటి కలయికతో వస్తాయి. మొదట సూర్యుడు, తర్వాత చంద్రుడు, ఈ రోజు గ్రహణంతో కలిసి మేము ఒక కొత్త చరిత్రను సృష్టించాం అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 42 మిలియన్లకు పైగా వ్యూస్, మిలియన్ల కొద్దీ లైక్స్ లభించాయి. క్రీడాభిమానులతో పాటు ఖగోళ శాస్త్ర ప్రియులు కూడా ఈ సాహస దృశ్యానికి ముగ్ధులయ్యారు.
ది స్కేట్ ఆల్కెమిస్ట్ ప్రయాణం:
1994లో జన్మించిన డానీ లియాన్‌ను స్కేట్‌బోర్డింగ్ ప్రపంచంలో ది స్కేట్ ఆల్కెమిస్ట్ లేదా లయన్ ఆఫ్ మోస్టోలెస్ అని పిలుస్తారు. ఆయన 9 సంవత్సరాల వయసులో ఇంటి కిటికీ నుంచి పక్కనే నిర్మిస్తున్న స్కేట్‌పార్క్ చూసి ఆకర్షితులయ్యారు. తల్లిదండ్రులను మొదటి స్కేట్‌బోర్డ్ అడిగి తీసుకున్న డానీ, అహోరాత్రులు శ్రమించి స్థానిక పోటీల నుండి ఒలింపిక్స్ స్థాయికి ఎదిగారు. ఆయన టోక్యో 2020, ప్యారిస్ 2024 ఒలింపిక్స్‌లో స్పెయిన్ తరఫున ప్రాతినిధ్యం వహించారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
హిస్టారిక్ మోమెంట్:
స్పెయిన్ ఆకాశంలో దాదాపు వంద సంవత్సరాల తర్వాత కనిపించిన ఈ ఖగోళ అద్భుతాన్ని తిలకించేందుకు 5 లక్షల మందికి పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. తీవ్రమైన వేడి వాతావరణం ఉన్నప్పటికీ, ఆకాశం చీకటిమయమైన ఆ ఒక్క నిమిషం పాటు ప్రజలు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. అదే చారిత్రాత్మక క్షణంలో డానీ లియాన్ చేసిన ఈ సిల్హౌట్ జంప్ క్రీడలు, విజ్ఞాన శాస్త్రాల కలయికగా నిలిచిపోయి, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(@danny_leon)