Headlines

పోహా, ఉప్మా, ఇడ్లీ.. ఉదయం ఏది తింటే ఆరోగ్యానికి మంచిది? అందరూ చేసే తప్పులు ఇవే.. | Poha vs Upma vs Idli: Which is the Healthiest Breakfast for You

పోహా, ఉప్మా, ఇడ్లీ.. ఉదయం ఏది తింటే ఆరోగ్యానికి మంచిది? అందరూ చేసే తప్పులు ఇవే.. | Poha vs Upma vs Idli: Which is the Healthiest Breakfast for You


దాదాపు ప్రతి ఇంట్లో రోజూ ఉదయం ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న.. ఈ రోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏం చేయాలి?. కొందరికి వేడివేడి పోహా ఇష్టమైతే, మరికొందరు ఘుమఘుమలాడే ఉప్మాతో రోజును ప్రారంభిస్తారు. దక్షిణాది వారి ప్లేట్‌లో ఇడ్లీ-సాంబార్‌ స్థానం ప్రత్యేకం. అయితే రుచిని కాసేపు పక్కన పెట్టి ఆరోగ్య కోణంలో చూస్తే వీటిలో ఏది బెస్ట్? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కేవలం ఏది త్వరగా జీర్ణమవుతుంది లేదా ఏది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది అనేది మాత్రమే కొలమానం కాదు. అందులోని ప్రొటీన్లు, ఫైబర్, వాడే నూనె పరిమాణం వంటి అంశాలు ఎంతో ముఖ్యం. అసలు పదార్థం కన్నా.. దానిని ఎలా తయారు చేసుకుని, వేటితో కలిపి తింటున్నారు అనేదే ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది.

పోహాను మరింత హెల్తీగా మార్చుకోండిలా..

అటుకులతో చేసే పోహా ఉదయాన్నే తినడానికి చాలా తేలికైన ఆహారం. అయితే దీన్ని కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉండే పదార్థంగా తినకుండా, పోషకాల గనిగా మార్చుకోవచ్చు. బఠానీలు, క్యారెట్లు, క్యాప్సికమ్ వంటివి చేర్చడం వల్ల విటమిన్లు అందుతాయి. వేరుశెనగలు లేదా మొలకెత్తిన గింజలను కలపడం ద్వారా ప్రొటీన్ పరిమాణం పెరుగుతుంది. పోహాను పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవడంతో పాటు సంపూర్ణ సమతుల్య ఆహారంగా మారుతుంది.

కూరగాయలతో కూడిన ఉప్మాతో బోలెడు మేలు

రవ్వతో తయారు చేసే ఉప్మా కూడా అద్భుతమైన అల్పాహార ఎంపిక. ఉప్మాను మరింత ఆరోగ్యకరంగా మార్చే చిట్కాలు. క్యారెట్లు, బీన్స్, టమాటాలు, బఠానీలతో పాటు పప్పుదినుసులు, వేరుశెనగలు చేరిస్తే పీచు, పోషక విలువలు రెట్టింపవుతాయి. ఉప్మా చేసేటప్పుడు నూనె లేదా నెయ్యి ఎక్కువగా వాడకుండా చూసుకోవాలి. నూనె మోతాదు పెరిగితే తేలికపాటి ఉప్మాలో అనవసర క్యాలరీలు పెరుగుతాయి.

ఆవిరితో ఉడికే ఇడ్లీ.. సాంబార్ అసలైన బలం..

నూనె లేకుండా ఆవిరి మీద ఉడికించే ఇడ్లీ చాలా సులభంగా జీర్ణమవుతుంది. తక్కువ కొవ్వు కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇడ్లీలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ కాబట్టి, దాంతో పాటు తీసుకునే సాంబార్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. క్యారెట్, ముల్లంగి, సొరకాయ, ఉల్లిపాయలు, మునగకాయలు వేసి మినపప్పు, కందిపప్పుతో చేసే సాంబార్‌లో ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇడ్లీ తక్కువగా తిని, సాంబార్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సరైన పోషకాలు అందుతాయి.

ఏది బెస్ట్?

వీటిలో ఏదో ఒకదానిని మాత్రమే అందరికీ బెస్ట్ అని తేల్చలేమని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ దీప్తి ఖతుజా తెలిపారు. తక్కువ కొవ్వు, తేలికపాటి భోజనం కావాలంటే ఇడ్లీ సాంబార్ ఉత్తమం. ప్రొటీన్లు, కూరగాయలు సమపాళ్లలో చేర్చితే పోహా, ఉప్మా కూడా సమతుల్య ఆహారంగా మారతాయి. సరైన మోతాదులో కూరగాయలు, ప్రొటీన్లను జోడించి, తక్కువ నూనెతో వండితే ఈ టిఫిన్స్ ఆరోగ్యకరమైన జీవనశైలికి సరిగ్గా సరిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *