నేటి ఉరుకుల పరుగుల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మనల్ని నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతం చేస్తున్నాయి. కడుపులో గ్యాస్, ఎసిడిటీ నుంచి మొదలుకొని ముఖంపై మొటిమలు, చర్మ వ్యాధుల వరకు అనేక సమస్యల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తుంటాం. అయితే మన పెరట్లోనే సహజసిద్ధంగా లభించే ఔషధ గుణాల గని వేపతో ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణుడు రామ్ అవతార్ చెబుతున్నారు. ఆయుర్వేదంలో వేపను సర్వరోగ నివారిణిగా భావిస్తారు. రుచికి చేదుగా ఉన్నప్పటికీ, రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నాలుగైదు వేప ఆకులను నమలడం వల్ల శరీరానికి లభించే ఆరోగ్య ప్రయోజనాలు అపారమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పరగడుపున వేప ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
రక్త శుద్ధి – కాంతివంతమైన చర్మం: వేప సహజసిద్ధమైన రక్తశుద్ధి కారకంగా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వల్ల రక్తంలోని హానికర టాక్సిన్లు తొలగిపోతాయి. రక్తం శుభ్రపడటంతో మొటిమలు తగ్గి, చర్మం అంతర్గతంగా మెరుస్తుంది.
జీర్ణక్రియ మెరుగుదల: పొట్టలోని హానికర బ్యాక్టీరియాను వేప సమర్థవంతంగా నాశనం చేస్తుంది. పేగులను శుభ్రపరిచి గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
షుగర్ లెవల్స్ నియంత్రణ: వేప ఆకుల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే గుణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహకరిస్తాయి
బరువు నియంత్రణ: శరీర జీవక్రియలను వేగవంతం చేయడంలో వేప తోడ్పడుతుంది. ఇది కొవ్వు కరిగే ప్రక్రియను ప్రేరేపించి, అధిక బరువును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి పెంపు: వేపలో పుష్కలంగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తాయి. సీజనల్ మార్పుల వల్ల వచ్చే జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.
వేప ఆకులను ఎలా తీసుకోవాలి?
- ఉదయం నిద్రలేవగానే 4 నుంచి 5 లేత, తాజా వేప ఆకులను తీసుకోవాలి.
- వాటిపై దుమ్ము లేకుండా శుభ్రమైన నీటితో కడగాలి.
- పరగడుపున ఈ ఆకులను బాగా నమిలి మింగిన తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీరు త్రాగాలి.
- ఆకులను నేరుగా నమలడం కష్టంగా అనిపిస్తే, నీటిలో మరిగించి ఆ కషాయాన్ని కూడా సేవించవచ్చు.