Headlines

Vizag: ఇక చరిత్ర పుటల్లోనే..! విశాఖ ఎయిర్ పోర్టులో భావోద్వేగ క్షణాలు.. చివరి ఫ్లైట్ ఇదే..! | Visakhapatnam Airport Commercial Flights Closed, Operations Shift To Bhogapuram Airport


ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం పాటు పౌర విమానయాన సేవలకు కేంద్ర బిందువుగా నిలిచిన విశాఖపట్నం విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలకు తెరపడింది. నాలుగున్నర దశాబ్దాలకు పైగా కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన ఈ విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ వాణిజ్య విమానాల రాకపోకలు ఆదివారం అర్ధరాత్రి నుంచి శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. భోగాపురంలో అత్యాధునిక అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

చివరి విమాన సర్వీస్.. భావోద్వేగ వీడ్కోలు

విశాఖ విమానాశ్రయం నుంచి చివరి షెడ్యూల్డ్ వాణిజ్య విమానం రాత్రి 10:45 గంటలకు బయలుదేరనుంది. ఢిల్లీకి వెళ్లే ఇండిగో 6E 2018 సర్వీసు చివరిసారిగా టేకాఫ్ కావడంతో ఎయిర్‌పోర్టులో షెడ్యూల్డ్ పౌర విమాన సర్వీసుల అధ్యాయం అధికారికంగా ముగియనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టం సందర్భంగా ఎయిర్‌పోర్ట్ అధికారులు, సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 00:01 గంటల నుంచి వైజాగ్ విమానాశ్రయ అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ కోడ్ VTZ అధికారికంగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు బదిలీ అవుతుంది. అనంతరం భోగాపురం నుంచే పూర్తిస్థాయి పౌర విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

ఒక్క విమానం నుంచి అంతర్జాతీయ స్థాయికి

విశాఖ ఎయిర్‌పోర్టుకు ఘనమైన చరిత్ర ఉంది.

  • 1941: రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడ తొలి రన్‌వేను నిర్మించింది.
  • 1962: సాధారణ పౌర విమాన రాకపోకల కోసం ఈ రన్‌వేను వినియోగంలోకి తెచ్చారు.
  • 1972: దేశ రక్షణ అవసరాల దృష్ట్యా రన్‌వే నిర్వహణ బాధ్యతలను నేవీ చేపట్టింది.
  • 2007: జూన్‌లో కొత్త రన్‌వే అందుబాటులోకి రావడంతో నైట్ ల్యాండింగ్, అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలయ్యాయి.

చిన్న రన్‌వే, రోజుకు ఒక విమాన సర్వీసుతో ప్రారంభమైన వైజాగ్ ఎయిర్‌పోర్ట్.. సగటున రోజుకు 40 విమానాలు, 10 వేల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించే స్థాయికి ఎదిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 29.68 లక్షల మంది ప్రయాణికులకు ఈ విమానాశ్రయం సేవలందించింది.

ఇకపై పూర్తిగా నేవీ ఆధ్వర్యంలోనే

నావల్ ఎయిర్ స్టేషన్ కార్యకలాపాలు పెరగడం, రక్షణ రంగ అవసరాల దృష్ట్యా ఇకపై ఈ విమానాశ్రయం పూర్తిగా భారత నావికాదళం ఆధ్వర్యంలోనే కొనసాగనుంది. సాధారణ వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయినప్పటికీ.. సైనిక విమానాలు, ప్రభుత్వ అతిథులు, లీజ్డ్, వీఐపీ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు ప్రత్యేక, అత్యవసర ల్యాండింగ్‌లకు మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *