తల్లిదండ్రులతో కలిసి రైలులో ప్రయాణించింది.. గమ్యస్థానానికి చేరుకుని రైలు దిగింది.. మరికొద్ది క్షణాల్లోనే ఊహించని ప్రమాదం ఆమె ప్రాణాలను బలితీసుకుంది. జనగాం నుంచి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన 20 ఏళ్ల నర్స్ మానేపల్లి మానస వందేభారత్ రైలు ఢీకొని మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతురాలిని మానేపల్లి మానస (20) నర్సుగా పనిచేస్తున్న మానస చిన్న వయసులోనే ఇలా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
అసలు ఏం జరిగింది?
ఆదివారం, ఆగస్టు 16న మధ్యాహ్నం 3 గంటలలోపు మౌలాలి రైల్వే ఎల్‌సీ గేట్ నంబర్-6 సమీపంలోని అప్‌లైన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మానస తన తల్లిదండ్రులతో కలిసి జనగాం నుంచి మౌలాలి వరకు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించింది. మౌలాలి వద్ద రైలు దిగిన తర్వాత ప్లాట్‌ఫామ్ నంబర్-2 నుంచి ప్లాట్‌ఫామ్ నంబర్-1 వైపు వెళ్లే క్రమంలో పట్టాల దాటే సమయంలో ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆ మార్గంలో దూసుకొచ్చింది. మానసను రైలు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
క్షణాల వ్యవధిలో విషాదం..
గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన తర్వాత మానస పట్టాల వైపు ఎందుకు వెళ్లింది? వందేభారత్ వస్తున్న విషయాన్ని గమనించలేదా? ప్లాట్‌ఫామ్ మారేందుకు పట్టాలు దాటేందుకు ప్రయత్నించిందా? ప్రమాదానికి ముందు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు క్రైమ్ నంబర్ 418/2026 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమికంగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా కనిపిస్తున్నప్పటికీ, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది.
వృత్తిరీత్యా నర్స్ అయిన 20 ఏళ్ల మానస.. అనారోగ్యంతో బాధపడేవారికి సేవలు అందిస్తూ ప్రాణాలు కాపాడే వృత్తిని ఎంచుకుంది. కానీ విధి మరోలా రాసింది. తల్లిదండ్రులతో కలిసి చేసిన సాధారణ రైలు ప్రయాణమే ఆమెకు చివరి ప్రయాణంగా మారింది. కళ్లముందే కుమార్తెను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. జనగాంలో మొదలైన కుటుంబ ప్రయాణం.. మౌలాలి వద్ద తీరని విషాదంతో ముగిసింది. కేవలం కొన్ని క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదం ఒక కుటుంబానికి జీవితాంతం మిగిలిపోయే దుఃఖాన్ని మిగిల్చింది.