Headlines

నితిన్ నబిన్ కొత్త టీమ్ రెడీ.. పురందరేశ్వరీ, వసుంధర రాజేకు కీలక బాధ్యతలు..! | BJP National Executive Reshuffle: Nitin Nabin’s New Team announced after 7 months


ఏడు నెలల తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తన కొత్త టీమ్‌ను ప్రకటించారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, సంస్థాగత బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక పదవుల్లో మార్పులు, చేర్పులు చేశారు. కొత్త కార్యవర్గంలో పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించగా.. మరికొందరికి పదవులు కొనసాగించారు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా మొత్తం 13 మందిని నియమించారు. ఇందులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్ మాధవ్, పురంధేశ్వరి వంటి కీలక నేతలకు చోటు దక్కింది. ఇదే సమయంలో తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించారు. కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కకపోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

జాతీయ ప్రధాన కార్యదర్శులుగా మొత్తం ఎనిమిది మందిని నియమించారు. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి జాతీయ జనరల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న బీఎల్ సంతోష్‌ను సంస్థాగత ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగించారు. ఆయనకు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు యథావిధిగా కొనసాగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డికి కూడా కొత్త బృందంలో కీలక బాధ్యత లభించింది. ఆయనను జాయింట్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. అలాగే కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్‌గా తరుణ్ చుగ్‌ను నియమించారు. ఓబీసీ విభాగానికి కొత్త అధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్యను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆర్థిక వ్యవహారాల్లోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను పార్టీ కోశాధికారిగా నియమించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన రాజేష్ అగర్వాల్ స్థానంలో పీయూష్ గోయల్ బాధ్యతలు చేపట్టనున్నారు. రాజేష్ మంగళ్‌ను సహ-కోశాధికారిగా నియమించారు. ఇక పార్టీ మీడియా వ్యవహారాల్లో అనిల్ బలూని తన బాధ్యతల్లో కొనసాగనున్నారు. పార్టీకి సంబంధించిన మీడియా కమ్యూనికేషన్, ప్రచార వ్యూహాల్లో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.

కొత్త కార్యవర్గ కూర్పులో ప్రాంతీయ సమీకరణాలు, అనుభవం, సంస్థాగత సామర్థ్యం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేతలతో పాటు కొత్త తరానికి చెందిన నేతలకు కూడా బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యం కనిపిస్తోంది.

అయితే తెలంగాణకు కొత్త జాతీయ కార్యవర్గంలో చోటు దక్కకపోవడం చర్చకు దారితీస్తోంది. గతంలో జాతీయ స్థాయిలో కీలక పదవుల్లో ఉన్న నేతలకు ప్రస్తుత కూర్పులో ప్రాధాన్యం తగ్గడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు వసుంధర రాజే, రామ్ మాధవ్, పురంధేశ్వరి వంటి నేతలకు ఉపాధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం బీజేపీ జాతీయ స్థాయిలో తీసుకున్న కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.

మొత్తంగా నితిన్ నబిన్ కొత్త టీమ్‌లో భారీ మార్పులు, కీలక నియామకాలు చోటుచేసుకున్నాయి. రానున్న రోజుల్లో ఈ కొత్త కార్యవర్గం పార్టీ సంస్థాగత విస్తరణ, రాష్ట్రాల వారీగా రాజకీయ వ్యూహాలు, ఎన్నికల సన్నద్ధతలో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *