Headlines

కొండపై నుంచి దూకేందుకు యత్నం.. కొడుకును కాపాడేందుకు వెళ్లి తల్లిదండ్రులు సైతం మృతి..! | Maharashtra Tragedy: Teen tries to jump off Sambhajinagar cliff, parents try to save him, all are die


మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న కుమారుడిని కాపాడేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తిస్‌గావ్ ప్రాంతంలోని ఖవద్య కొండల వద్ద గురువారం (ఆగస్టు 20) ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జల్తా ఫాటా ప్రాంతానికి చెందిన కునాల్ మురళీధర్ చంద్‌గుడే (19) మొబైల్ ఫోన్ విషయంలో తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. అనంతరం ఉదయం సుమారు 10 గంటల సమయంలో కొండపైకి వెళ్లాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కునాల్‌ను కిందకు తీసుకురావడానికి అతని తల్లి సంగీత, తండ్రి మురళీధర్‌తో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక సర్పంచ్, గ్రామస్తులు ప్రయత్నించారు.

లోతైన లోయకు ఎదురుగా ఉన్న ప్రమాదకరమైన రాతి దిబ్బపై కునాల్ నిలబడటంతో దాదాపు మూడు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అతడిని ఒప్పించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒక దశలో స్థానిక సర్పంచ్ కునాల్‌ను కిందకు తీసుకురావడానికి ఐఫోన్ ఇస్తానని కూడా చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ అతడు వెనక్కి తగ్గలేదు.

చివరకు కునాల్ కొండపై నుంచి కిందకు దూకాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి మురళీధర్ కూడా వెంటనే దూకడంతో ఇద్దరూ లోయలో పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. భర్త, కుమారుడు కిందపడటాన్ని చూసిన తల్లి సంగీత తీవ్ర భయాందోళనకు గురై ఆమె సైతం కొండపై నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *