Headlines

కొంపముంచిన లిక్కర్ బాటిల్.. మద్యం అనుకుని తాగిన తండ్రీకొడుకులు.. కొడుకు మృతి! | Pesticide Poisoning: Father Son Drink Toxin Instead of Alcohol, Son Dies in East Godavari district


తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం బాటిల్‌లో ఉన్న పురుగుల మందును మద్యంగా భావించి తాగిన తండ్రీకొడుకుల్లో కుమారుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దేవరపల్లి మండలం సంగాయగూడెంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగాయగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు వంశీకృష్ణ (34) రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. ప్రతిరోజు కూలి పనులకు వెళ్లి వచ్చిన తర్వాత మద్యం సేవించే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇంట్లో ఉన్న ఓ మద్యం బాటిల్‌లో పురుగుల మందును ఉంచారు. అది గమనించని తండ్రీకొడుకులు మద్యం అనుకుని పురుగుల మందును సేవించారు.

కొద్దిసేపటికే ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో వంశీకృష్ణ (34) పరిస్థితి విషమించి మృతి చెందాడు. తండ్రి వెంకటేశ్వరరావుకు కూడా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరించారు. పురుగుల మందు మద్యం బాటిల్‌లోకి ఎలా వచ్చింది, దాన్ని తండ్రీకొడుకులు మద్యం అని ఎందుకు భావించారు అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం బాటిళ్లలో ఇతర విషపదార్థాలు ఉంచడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *