సోషల్ మీడియాలో ఒక షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయీ జిల్లాలో ఒళ్లు జలదరించే సంఘటన చోటు చేసుకుంది. చూసిన వారికి ఊపిరి ఆగిపోయేలా ఉంది. రైలు పట్టాలపై మద్యం మత్తులో తూలుతూ పడిపోయిన ఓ యువకుడిని, లోకో పైలట్ తన సమయస్ఫూర్తితో ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ హృదయ విదారక దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లోకో పైలట్ చాకచక్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అసలేం జరిగిందంటే…
హర్దోయీ జిల్లా పరిధిలోని సీతాపూర్-బలమౌ రైలు మార్గంలో ఒక యువకుడు తీవ్రమైన మద్యం మత్తులో పట్టాలు దాటడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బ్యాలెన్స్ తప్పి పట్టాలపై పడిపోయి లేవలేని స్థితిలోకి వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో బలమౌ వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు వేగంగా వస్తోంది.
పట్టాలపై పడి ఉన్న యువకుడిని గమనించిన లోకో పైలట్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. అయితే వేగం కారణంగా రైలు ఇంజన్ ఆ యువకుడి పైకి వెళ్లాక ఆగింది. ప్రమాదం జరిగిపోయిందని అందరూ భయాందోళనకు గురయ్యారు. రైలు ఆగగానే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ కిందకు దిగి పరిశీలించగా, ఆ యువకుడు రైలు ఇంజన్ కింద పట్టాల మధ్యన పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్థానికుల సాయంతో ఆ యువకుడిని సురక్షితంగా బయటకు లాగారు. ఆశ్చర్యకరంగా, అంత పెద్ద ప్రమాదం జరిగినా ఆ యువకుడికి చిన్న గాయం కూడా కాకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
ఈ రెస్క్యూకి సంబంధించిన వీడియోను అక్కడున్న వారు ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. సకాలంలో స్పందించి ఒక అమాయక ప్రాణాన్ని కాపాడిన లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్‌పై నెటిజన్లు, రైల్వే అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మద్యం మత్తులో పట్టాల పైకి రావడం అత్యంత ప్రమాదకరమని, ఇటువంటి నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు తెస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.