Headlines

సడెన్‌గా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే డేంజర్.. | What to Do When You See a Cobra: Essential Safety Tips for Monsoon Snake Encounters


వర్షాకాలంలో పాములు జనావాసాల్లోకి రావడం కామన్. ఈ సీజన్‌లో పాము కాట్ల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక మన దేశంలో అత్యంత విషపూరితమైన పాముల్లో నాగుపాము ప్రధానమైనది. పొలాల్లో, పెరట్లో లేదా రోడ్డుపై వెళ్లేటప్పుడు అకస్మాత్తుగా నాగుపాము ఎదురై పడగ విప్పితే ఎవరైనా సరే భయంతో వణికిపోతారు. అయితే ఆ క్షణంలో కంగారుపడి చేసే చిన్న పొరపాటే ప్రాణాల మీదకు తెస్తుంది. నాగుపాము కనిపించగానే భయంతో కేకలు వేయడం, గబగబా పరుగెత్తడం చేయకూడదు. ఆకస్మిక కదలికలను పాము తనకు ముప్పుగా భావించి వెంటనే దాడికి దిగుతుంది. పాము కనిపించిన వెంటనే కొన్ని క్షణాల పాటు ఎలాంటి కదలికలు లేకుండా ప్రశాంతంగా నిలబడాలి. మీరు తనకు హాని తలపెట్టడం లేదని గ్రహిస్తే పాము దాడి చేయకుండా వెళ్లిపోవడానికే ప్రయత్నిస్తుంది.

కళ్లలోకి చూడకండి.. నెమ్మదిగా వెనక్కి తగ్గండి

పాము కళ్లలోకి అలాగే చూడడం దాన్ని రెచ్చగొట్టినట్లవుతుంది. చూపును తటస్థంగా ఉంచి, ఏమాత్రం కంగారు పడకుండా ఒక్కో అడుగు నెమ్మదిగా వెనక్కి వేయాలి. వెనక్కి తగ్గే క్రమంలో పాముకు పూర్తిగా వీపు చూపించకుండా దాని కదలికలను ఒక కంట కనిపెడుతూ ఉండాలి.

పాముకు వెళ్లేందుకు దారి ఇవ్వండి

నాగుపాము సాధారణంగా మనుషులతో తలపడటానికి ఇష్టపడదు. తప్పించుకుని పారిపోవడానికే చూస్తుంది. కాబట్టి దాన్ని కర్రలతో కొట్టడం, బంధించడం వంటి పనులు చేయవద్దు. దానికి బయటకు వెళ్లేందుకు మార్గం వదిలేస్తే అది నిశబ్దంగా వెళ్లిపోతుంది.

కనీసం 6 నుంచి 8 అడుగుల దూరం పాటించండి

నాగుపాములు తమ శరీర పొడవులో మూడింట ఒక వంతు దూరం వరకు అత్యంత వేగంగా దూకి కాటు వేయగలవు. అందుకే నాగుపాము నుంచి ఎల్లప్పుడూ కనీసం 6 నుంచి 8 అడుగుల సురక్షిత దూరాన్ని పాటించాలి. ఒకవేళ అది పడగ విప్పి బుసలు కొడుతుంటే మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత ముఖ్యం

ఇంటి చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలు, రాళ్లు లేదా చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టార్చ్‌లైట్ వాడటం, బూట్లు ధరించడం వంటి జాగ్రత్తలు పాముకాటు బారిన పడకుండా కాపాడుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *