Headlines

నడవడంలో ఇబ్బంది, తిమ్మిర్లు.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 లోపం ఉన్నట్లే.. | Vitamin B12 Deficiency: These Warning Signs Should Not Be Ignored


మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు అవసరం.. అలాంటి విటమిన్లలో విటమిన్ బీ12 కూడా కీలకమైనది. శరీరంలో దీని లోపం పలు సమస్యలకు దారి తీస్తుంది.. వాస్తవానికి విటమిన్ బీ12 ఎర్ర రక్త కణాల తయారీకి, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి.. DNA ఉత్పత్తికి చాలా ముఖ్యం. శాకాహారులలో లేదా ఆహారాన్ని సరిగ్గా గ్రహించలేని వారిలో బీ12 లోపం సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే.. భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విటమిన్ B12 లోపం ఒక కీలకమైన ఆరోగ్య సమస్యగా మారిందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

విటమిన్ B12 ప్రాముఖ్యత

విటమిన్ B12 అనేది ఒక సూక్ష్మ పోషకం. శరీరంలో అనేక కీలకమైన విధులను నిర్వహిస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం.. శరీరంలోని ప్రతి కణానికి విటమిన్ B12 అవసరం. ఆహారాన్ని శక్తిగా మార్చడం, కొత్త అణువులను తయారు చేయడం, కణాల్లో జరిగే రసాయన చర్యల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మన నాడీ వ్యవస్థ పనితీరుకు కూడా ఇది చాలా అవసరం. రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థపై కూడా దీని ప్రభావం ఉంటుందని.. పేర్కొంటున్నారు. ముఖ్యంగా శరీరమంతా ఆక్సిజన్‌ను సరఫరా చేసే ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు B12 అవసరమని పేర్కొంటున్నారు.

విటమిన్ B12 లభించే వనరులు

విటమిన్ B12 ముఖ్యంగా మాంసాహారంలో లభిస్తుంది. మొక్కలకు సంబంధించిన ఆహారాల్లో ఇది ఉండదు. మాంసం, సీఫుడ్, చేపలు, చికెన్, గుడ్లు, పాలు, ఇతర డెయిరీ ఉత్పత్తులలో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. అదనంగా, ఈ విటమిన్‌ను చేర్చిన ఫోర్టిఫైడ్ ఆహారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. లోపం ఉన్నవారు లేదా ఆహారం ద్వారా తగినంతగా పొందలేని వారు క్యాప్సూల్స్ లేదా ఇంజెక్షన్ల రూపంలో లభించే సప్లిమెంట్లను తీసుకోవచ్చు. అయితే, ఏదైనా సప్లిమెంట్ తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో B12 శోషణ ఎలా జరుగుతుంది?

శరీరం విటమిన్ B12 ను గ్రహించే ప్రక్రియ సంక్లిష్టమైనది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, ఇది రెండు దశల్లో జరుగుతుంది. మొదట, పొట్టలోని యాసిడ్ ఆహారంలోని ప్రోటీన్ల నుండి విటమిన్ B12 ను వేరు చేస్తుంది. రెండవ దశలో, ప్రోటీన్ నుండి వేరైన B12, పొట్టలో ఉత్పత్తి అయ్యే మరొక ప్రోటీన్ (ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్)తో కలిసి శరీరం శోషించుకుంటుంది. సప్లిమెంట్ల ద్వారా లభించే B12 ప్రోటీన్‌తో బంధించబడదు.. కాబట్టి మొదటి దశ అవసరం లేదు. కానీ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ మాత్రం తప్పనిసరి.

B12 లోపానికి కారణమయ్యే అంశాలు

తగినంత B12 విటమిన్ పొందని వారికి లేదా శరీరం సరిగ్గా శోషించుకోలేని వారికి ఈ లోపం వచ్చే ప్రమాదం ఉంది. వయసు పెరిగే కొద్దీ (50 ఏళ్లు పైబడిన వారికి) పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి తగ్గడం వల్ల శోషణ కష్టంగా మారుతుంది. అట్రాఫిక్ గ్యాస్ట్రైటిస్ ఉన్నవారిలో హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఉత్పత్తి తగినంతగా జరగదు. రక్తహీనత ఉన్నవారు, పేగులకు శస్త్రచికిత్స జరిగిన వ్యక్తులు, శాకాహారులు, వీగన్లు కూడా ఈ విటమిన్‌ను తగినంతగా పొందలేకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

B12 లోపం లక్షణాలు

విటమిన్ B12 లోపం లక్షణాలు కనిపించడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు. వైద్య నిపుణుల ప్రకారం.. లక్షణాలు నెమ్మదిగా కనిపిస్తాయి. కాలక్రమేణా తీవ్రమవుతాయి.
సాధారణ లక్షణాలు:

  • చేతులు లేదా కాళ్ళలో తిమ్మిర్లు, జలదరింపు
  • నడవడంలో ఇబ్బంది
  • రక్తహీనత
  • నాలుక వాపు
  • ఆలోచించడం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది లేదా జ్ఞాపకశక్తి క్షీణించడం
  • బలహీనత, అలసట
  • చర్మం పసుపు రంగులోకి మారడం
  • మూడ్ స్వింగ్స్, చిరాకు
  • ఏకాగ్రత లోపించడం

విటమిన్ B12 లోపాన్ని రక్తపరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. అయితే, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు నిపుణులను సంప్రదించడం, వారి సలహాలను పాటించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *