Headlines

‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’ షురూ.. 4 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు..! | America: Trump government sanctions 4 India based companies, 3 individuals over Iran oil trade


ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ఒత్తిడి మరింత తీవ్రతరమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’లో భాగంగా భారతదేశానికి చెందిన నాలుగు కంపెనీలపై ఆంక్షలు విధించింది. సుమారు 119 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల వాణిజ్యంలో పాల్గొన్నారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ శాఖ వెల్లడించింది. అంతేకాదు ముగ్గురు భారతీయులపైనా వ్యక్తిగతంగా ఆంక్షలు విధించింది.

సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్ 2024 ఫిబ్రవరి నుంచి 2025 జూన్ మధ్య సుమారు 69 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ ముడి పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఈ రవాణాల్లో గతంలో అమెరికా ఆంక్షలు విధించిన బొంజోర్ కమోడిటీ FZEతో సంబంధాలున్నట్లు ఆరోపించింది. అలాగే పీపీ సాఫ్ట్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతిస్ ఇన్‌ఫ్రా ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు చెరో 25 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని అమెరికా ట్రెజరీ పేర్కొంది.

ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తుల రవాణాకు సహకరించిందనే ఆరోపణలతో భారత కస్టమ్స్ బ్రోకర్ సంస్థ పోర్టీజ్ పార్ట్‌నర్స్ LLPపైనా ఆంక్షలు విధించారు. పీపీ సాఫ్ట్‌టెక్ డైరెక్టర్ ప్రశాంత్ గార్గ్‌తో పాటు పోర్టీజ్ భాగస్వాములు ఇంద్రిస్మియా అష్రఫ్మియా షేక్, హరీష్ రామచంద్ర రంగిలను కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుంది. తాజా చర్యలను అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ‘ఆర్థిక డి-డే’గా అభివర్ణించారు. ఇరాన్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి ఏకాకిని చేయడమే తమ లక్ష్యమని, టెహ్రాన్‌తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే సంస్థలు, వ్యక్తులు జరిమానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అయితే అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి అంతర్జాతీయ చట్టానికి, ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధమని పేర్కొంది. ఆంక్షలను ఎదుర్కొనేందుకు తమ దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే తెలిపారు. తమకు రెండేళ్ల ప్రణాళిక ఉందని వెల్లడించారు.

మరోవైపు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల్లో ఆర్థిక ఒత్తిడి పెరగడం చమురు మార్కెట్లలో కొంత భయాన్ని తగ్గించినప్పటికీ, హోర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తమైతే చమురు ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇరాన్‌తో వాణిజ్యం చేస్తున్న దేశాలు, ముఖ్యంగా భారతీయ సంస్థలు, అమెరికా ఆంక్షల ప్రభావంపై అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *