Headlines

Hyderabad: హైదరాబాద్-విజయవాడ హైవేపై వెళ్తున్నారా..? టెన్షన్ ఇక లేనట్లే.. ఏకంగా 17 ఫ్లైఓవర్ల నిర్మాణం | Hyderabad to Vijayawada Highway: 17 Flyovers to Open Soon, Travel Time and Accidents Expected to Reduce


హైదరాబాద్- విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. ఈ జాతీయ రహదారిపై 17 ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు ఊపందుకోగా.. త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటిని ప్రారంభిస్తే ప్రయాణం మరింత వేగవంతం కావడంతో జర్నీ సమయం తగ్గుతుంది. ప్రమాదాలు ఎక్కువగా జరిగే 17 బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. వీటితో పాటు హైమాస్ట్ లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకోగా.. త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది.

సంక్రాంతి నాటికి పూర్తి

ఈ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాచరు. సూర్యాపేట ఫ్లైఓవర్ ఇప్పటికే ప్రారంభానికి సిద్దమవ్వగా.. చిట్యాల దగ్గర నిర్మించిన ఫ్లైఓవర్ దసరా నాటికి ప్రారంభమవుతుందని తెలిపారు. మిగిలిన ఫ్లైఓవర్లను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించగా.. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి మొత్తం 17 ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటికే పెద్దకాపర్తి ఫ్లైఓవర్ ప్రారంభమవ్వగా.. వాహనదారుల రాకపోకలకు అనుమతించినట్లు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ల రాకతో ప్రమాదాలు భారీగా తగ్గడంతో పాటు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

ప్రమాదాలు తగ్గే అవకాశం

ఇక ఎన్‌హెచ్ 65ను 6+2 లైన్లుగా వస్తరించాల్సిన అవసరముందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు చర్చించానని చెప్పారు. మరోసారి నితిన్ గడ్కరీని కలుస్తానని, అవసరమైతే ప్రధాని మోదీని కలిసి వివరిస్తామని చెప్పారు. ఎన్‌హెచ్-65 విస్తరణపై కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు. ఇక హైవేపై మూగజీవాలు రాకుండా రెయిలింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ 17 ఫ్లైఓవర్లు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని సూచించారు. అర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్ఏఐ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించగా.. రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల పురోగతిపై చర్చించారు. వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అనుమతుల ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. ఇటీవల కోదాడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంతో పాటు ఇతర రోడ్డు ప్రమాదాలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరా తీశారు. ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *