Headlines

ఊరంతా కొట్టుకుపోయినా.. తట్టుకుని నిలబడ్డ ఆ ఒక్క ఇల్లు! | Shocked family stuck on balcony surrounded by Nepal flash flood


నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. అయితే వరద  ప్రవాహానికి చుట్టుపక్కల ఇళ్లు, భవనాలు క్షణాల్లో కొట్టుకుపోతుండగా.. ఒక ఇంట్లోని కుటుంబం మాత్రం సురక్షితంగా బయటపడింది.  అంతటి భయానక పరిస్థితుల్లో కూడా ఆ ఇల్లు వరద ఉధృతిని తట్టుకుని నిలబడింది.  బాల్కనీలో చిక్కుకున్న కుటుంబం చావు అంచుల వరకు వెళ్లి క్షేమంగా బయటపడ్డారు. ఆ  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు తమ ఇంట్లోని బాల్కనీలో చిక్కుకుపోయారు. వారి ఇంటి చుట్టూ వరద నీరు అత్యంత వేగంగా ప్రవహిస్తూ ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది.  బురద, బండరాళ్లతో ఆ ప్రవాహం వేగంగా దూసుకురావడంతో.. దాని మార్గంలో ఉన్న పలు నిర్మాణాలు, ఇళ్లు క్షణాల్లో కొట్టుకుపోయాయి.

ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు రెండవ అంతస్తు బాల్కనీలో చిక్కుకుపోయారు.  వేగంగా దూసుకొస్తున్న వరద ప్రవాహం  వారి ఇంటిని చుట్టుముట్టేసింది. ఇంటి వెనకా ముందు వరద ప్రవాహం  పోటెత్తింది.  బండరాళ్ళు బురదతో కొట్టుకొస్తూ ఆ భవనాన్ని వరద బలంగా ఢీకొడుతోంది. ఏ క్షణంలోనైనా ఆ ఇల్లు కూలిపోతుందేమో అన్నట్లు ప్రవాహం ముంచెత్తింది. బాల్కనీలో ఆ కుటుంబం ఏమీ చేయలేక దిక్కుతోచని స్థితిలో భయంతో విలవిలలాడింది.

అయితే ఆ వరద ప్రవాహం ఇంటిని ఢీకొట్టుకుంటూ వెళ్లినప్పటికీ.. చుట్టుపక్కల ఉన్న భవనాలన్నీ కొట్టుకుపోయినా.. ఆ ఇల్లు మాత్రం ఎలాంటి పెద్ద నష్టం లేకుండా వరదను తట్టుకుని పటిష్టంగా నిలబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ విశేషంగా ఆకర్షించింది. బాల్కనీలో ఉన్న ఆ కుటుంబం మాత్రం చావు అంచుల వరకు వెళ్లి సురక్షితంగా బయటపడింది.

ఇంటి పై చిక్కుకున్న యువకుడు.. హెలికాప్టర్‌తో రక్షించిన ఆర్మీ

వరుసగా ముంచెత్తుతున్న వరదలతో నేపాల్‌లోని అనేక గ్రామాలు, నివాస ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. దీంతో వందలాది మంది బాధితులు తిండి, తిప్పలు లేక తీవ్రంగా అల్లాడిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నేపాల్ ఆర్మీ సైనికులు రంగంలోకి దిగి ప్రాణాలకు తెగించి రక్షణ చర్యలు చేపడుతున్నారు.

అలాంటి ఒక భయానక సన్నివేశంలో.. ఓ నివాస ప్రాంతంలో ఇళ్లన్నీ మునిగిపోవడంతో, ఒక యువకుడు ప్రాణాలు కాపాడుకోవడానికి తన ఇంటి టెర్రస్ పైకి చేరుకున్నాడు. చుట్టూ  విరుచుకుపడుతున్న ప్రవాహం, కిందికి దిగే దారి లేకపోవడంతో ఆ యువకుడు మేడ పైనే నిస్సహాయ స్థితిలో గంటల తరబడి చిక్కుకుపోయాడు.

 నేపాల్ ఆర్మీ రెస్క్యూ బృందం తక్షణమే హెలికాప్టర్‌తో ఘటనా స్థలానికి చేరుకుంది.  మేడ పై స్థలం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, పైలట్ ఎంతో సమర్థవంతంగా  హెలికాప్టర్‌ను భవనానికి దగ్గర్లో గాల్లోనే స్థిరంగా ఉంచారు. ఆర్మీ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, మేడపై నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ యువకుడిని సురక్షితంగా ఎయిర్‌లిఫ్ట్ చేశారు.

సైన్యం సకాలంలో స్పందించి ప్రాణాలను నిలబెట్టడంతో ఆ యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఆర్మీ చేపట్టిన ఈ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *