Headlines

మాతృత్వమే సమాజ నిర్మాణానికి పునాది.. యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు | Mohan Bhagwat on Motherhood: RSS Chief Highlights Role of Mothers in Family, Society and Nation Building

మాతృత్వమే సమాజ నిర్మాణానికి పునాది.. యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు | Mohan Bhagwat on Motherhood: RSS Chief Highlights Role of Mothers in Family, Society and Nation Building


న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన విశ్వమంగళ సభ రెండు రోజుల జాతీయ అవగాహన సదస్సు ఘనంగా ముగిసింది. యుగానుకూల మాతృత్వం అనే అంశంపై జరిగిన ఈ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ పాల్గొని మాతృత్వం, కుటుంబ వ్యవస్థ, భారతీయ సంస్కృతి ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృత్వం గురించి మాట్లాడటం ఒక పురుషుడిగా తనకు కొంత వైరుధ్యంగా అనిపిస్తుందని మోహన్ భగవత్ అన్నారు. ఈ అంశం ప్రధానంగా మహిళలకు సంబంధించినదని, అయితే భారతీయ సంప్రదాయం, సంస్కృతి, సమాజ నిర్మాణంలో మాతృత్వం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు కూడా మాతృత్వం, కుటుంబ వ్యవస్థపై లోతైన ఆలోచనలు చేశారని గుర్తు చేశారు.

మాతృత్వంలోని శాశ్వత విలువలు ఎప్పటికీ మారవని, కాలానుగుణంగా పరిస్థితులు మారినా తల్లిత్వం అసలు స్వరూపం మారదని ఆయన అన్నారు. ప్రపంచ సృష్టి, పోషణ, జీవన కొనసాగింపుకు మాతృత్వమే ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. తల్లే ప్రతి మనిషికి మొదటి గురువని, పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, ఆలోచనలకు సరైన దిశను చూపేది కూడా తల్లేనని చెప్పారు. ప్రస్తుత కుటుంబాల్లో పిల్లలకు సమయం కేటాయించడం, వారితో నిరంతరం సంభాషించడం అత్యంత అవసరమని మోహన్ భగవత్ సూచించారు. పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వారి ఆసక్తులను ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యత అని అన్నారు. పిల్లలు మాటల కంటే తల్లిదండ్రుల ప్రవర్తనను అనుకరిస్తారని, అందువల్ల తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలని సూచించారు.

భారతీయ సంస్కృతి గురించి అనేక అపోహలు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చెందాయని, కానీ భారతీయ సంప్రదాయాల పునాది అత్యంత బలంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ చరిత్ర, సంస్కృతి, జీవన విలువలపై విశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ సంస్కృతి ప్రధాన సందేశమని, విదేశీ జీవన విధానాలను గుడ్డిగా అనుసరించకుండా భారతీయ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన ఈ ముగింపు కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన 900 మందికి పైగా మహిళలు హాజరయ్యారు.

జూలై 23, 24 తేదీల్లో నిర్వహించిన ఈ సదస్సులో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 280 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మాతృ నిర్మాణ్ సే రాష్ట్ర నిర్మాణ్ అనే నినాదంతో పనిచేస్తున్న విశ్వమంగళ సభ నిర్వహించిన ఈ కార్యక్రమానికి 2,000 నుంచి 2,500 మంది మహిళలు నమోదు చేసుకున్నారు. విశ్వమంగళ సభ ప్రస్తుతం దేశంలోని 33 ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, దాదాపు 6 లక్షల మంది మహిళలు సంస్థతో అనుబంధంగా ఉన్నారు. భారత్‌తో పాటు అమెరికా, నెదర్లాండ్స్ సహా 14 దేశాల్లో కూడా సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *