Headlines

Cinema : ముందు ప్లాప్ అన్నారు.. తర్వాత బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. | The Untold Journey of a Telugu Classic Super Hit Movie Kanyasulkam


తెలుగు భాషా సాహిత్యంలో రెండు ప్రధాన మార్పులు వచ్చాయని చెబుతారు. ప్రబంధ సాహిత్యంలో నన్నయ్య తెచ్చిన మార్పు మొదటిది కాగా, గురజాడ అప్పారావు రచనలతో ఆధునిక భాషా సాహిత్యం రెండో మార్పుకు నాంది పలికింది. గురజాడ అప్పారావు విశాఖపట్నం జిల్లాలో కన్యాశుల్కం పద్ధతిలో జరిగే బాల్యవివాహాల గురించి విజయనగరం మహారాజా వారు సేకరించిన వివరాలు చూసి చలించి, కన్యాశుల్కం నాటక రచనకు పూనుకున్నారు. 1892 ఆగస్టులో తొలిసారి ప్రదర్శితమైన ఈ నాటకం, వాడుక భాషలో వాస్తవ జీవితాన్ని ఆవిష్కరించి, సంఘ సంస్కరణకు సాహిత్యాన్ని ఒక ఆయుధంగా మలచింది.

ఈ అద్భుత నాటకాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని వినోదా పతాకంపై దేవదాసు చిత్రాన్ని నిర్మించి విజయం సాధించిన నిర్మాత డి.ఎల్. నారాయణ సంకల్పించారు. దర్శకుడిగా పి. పుల్లయ్యను ఎన్నుకున్నారు. కన్యాశుల్కం నాటకంలో మొత్తం 42 పాత్రలు ఉండటం, యధాతథంగా తీస్తే ఆరు గంటల నిడివిగల సినిమా అవుతుండటంతో స్క్రీన్‌ప్లేలో, సంభాషణల్లో అనేక మార్పులు చేయాల్సి వచ్చింది. దేవదాసు చిత్ర విజయంతో డి.ఎల్. నారాయణ, హీరో అక్కినేని నాగేశ్వరరావును గిరీశం పాత్ర కోసం సంప్రదించారు. అయితే, దేవదాసు లాంటి గొప్ప పాత్ర తర్వాత అబద్ధాలు చెప్పి, మోసాలు చేసే గిరీశం పాత్ర చేయడం భావ్యం కాదని అక్కినేని నిరాకరించారు.

అక్కినేని నిరాకరణతో ఆగ్రహించిన డి.ఎల్. నారాయణ, వెంటనే ఎన్.టి. రామారావును సంప్రదించగా, విభిన్న పాత్రలు చేయాలనే కోరికతో ఎన్.టి.ఆర్. గిరీశం పాత్రను పోషించడానికి వెంటనే అంగీకరించారు. అప్పటికే స్టార్ హీరో కావడంతో, గిరీశం పాత్రను విలన్‌గా కాకుండా హీరోగానే మలిచి, చివర్లో బుచ్చెమ్మ, గిరీశంల పెళ్లి జరిపించి కథను సుఖాంతం చేశారు. మధురవాణి పాత్ర కోసం దేవదాసు హీరోయిన్ సావిత్రిని ఎంపిక చేయగా, ఆమె ఆ పాత్ర చేస్తుండటంతో ఒక జావళితో పాటు రెండు పాటలను కూడా చేర్చారు. దేవదాసు చిత్రంలో పార్వతి పాత్రకు మొదట షావుకారు జానకిని ఎంపిక చేసి, తర్వాత చెప్పా పెట్టకుండా ఆమెను తీసేసి సావిత్రిని తీసుకున్న విషయం జానకిని బాధించింది. అయినప్పటికీ, కన్యాశుల్కంలో బుచ్చెమ్మ పాత్ర కోసం డి.ఎల్. నారాయణ అడగగానే, తన తొలి చిత్ర కథానాయకుడు ఎన్.టి.ఆర్. గిరీశం పాత్ర చేస్తుండటంతో, గత అనుభవాన్ని మనసులో పెట్టుకోకుండా జానకి వెంటనే అంగీకరించారు.

సి.ఎస్.ఆర్. ఆంజనేయులు రామప్పపంతులుగా, గోవిందరాజుల సుబ్బారావు లుబ్ధావధానులుగా, విన్నకోట రామన్న పంతులు అగ్నిహోత్రావధానులుగా, ఆయన భార్య వెంకమ్మగా హేమలత, వెంకటేశంగా మాస్టర్ కుందు, కరకటశాస్త్రిగా వంగర, పూటకూళ్లమ్మగా ఛాయాదేవి, లుబ్ధావధానుల కూతురు మీనాక్షిగా సూర్యకాంతం, సౌజన్యరావు పంతులుగా గుమ్మడి నటించారు. ఈ సినిమాలో చేదమురారే కళ్యాణము అంటూ దేవులపల్లి రాసిన పెళ్లి పాట ఒకటి ఉంది. ఈ పాటలో అభినయించిన ఆడపిల్లలందరూ జ్ఞాప్తి కామేశ్వరరావు గారి బాలానందం సభ్యులే. చరణాల్లో అభినయించిన ఇద్దరు పాపల్లో ఊర్వశి శారద ఒకరు. బేబీ సరస్వతిగా ఆమె కెమెరా ముందు నిల్చున్న తొలి చిత్రం ఇదే.

కన్యాశుల్కం చిత్రీకరణ ప్రారంభమయ్యే నాటికే సావిత్రికి జెమినీ గణేశన్‌తో రహస్య వివాహం జరిగింది (మనం పోల్ మాంగల్యం షూటింగ్ సమయంలో 1952లోనే వీళ్లిద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు). ఈ విషయం సావిత్రి పెదనాన్న కొమ్మారెడ్డి వెంకటరామయ్య చౌదరికి తెలియదు. ఈ బంగారు బాతు మీద ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. లక్స్ సబ్బు ప్రకటనల ఫోటోల కోసం సావిత్రి కొన్ని ఫోటోలు దిగగా, అందులో ఒక ఫోటో వెనుక సావిత్రి గణేశ్ అని ఆమె రాసుకున్నది ఇంట్లో వాళ్లకు దొరికింది. చౌదరికి అనుమానం వచ్చి, ఆమె కదలికలపై నిఘా పెట్టారు. సావిత్రి ఇంకా తన చెప్పుచేతల్లో ఉందని నిర్ధారించుకోవడానికి, టైటిల్స్‌లో కె. సావిత్రి అని వేయించమన్నారు. సావిత్రి కూడా తన పెళ్లి విషయాన్ని బయటపెట్టే ధైర్యం లేక అలాగే చేశారు.

1955 ఆగస్టు 26న విడుదలైన ఈ చిత్రం, తొలి విడుదలలో ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. సినిమా కోసం నాటకంలో చేసిన మార్పులు వారికి నచ్చకపోవడంతో, గురజాడ, నాటకం పరువు తీశారని కొందరు ఘాటుగా విమర్శించారు. అయితే, పాతికేళ్ల తర్వాత మళ్లీ విడుదలైనప్పుడల్లా ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించి, మంచి వసూళ్లను సాధించింది. 1983లో హైదరాబాద్ సంధ్యా థియేటర్‌లో నూన్ షోలతో విడుదలై 19 వారాలు ఆడింది. 1986లో హైదరాబాద్ సప్తగిరి థియేటర్‌లో 51 రోజులు, విజయవాడ విజయ టాకీస్‌లో, గుంటూరు రాధాకృష్ణలో 100 రోజులు ప్రదర్శితమై, తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *