Headlines

Traffic Fines: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త! | Bad news for motorists: From now on, even police vehicles will issue traffic fines.. Be careful

Traffic Fines: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త! | Bad news for motorists: From now on, even police vehicles will issue traffic fines.. Be careful


Traffic Fines: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను గుర్తించేందుకు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు లేదా ప్రత్యక్షంగా విధుల్లో ఉన్న పోలీసులు మాత్రమే ఉల్లంఘనలను గుర్తించేవారు. అయితే ఇకపై రోడ్లపై తిరిగే ట్రాఫిక్ పోలీసుల పెట్రోలింగ్ వాహనాలే చలాన్లు నమోదు చేసే రోజులు దగ్గరపడుతున్నాయి.

ఈ వినూత్న వ్యవస్థను ట్రిపుల్ ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అప్లైడ్ ఏఐ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికతలో భాగంగా కృత్రిమ మేధ (AI) ఆధారిత డ్యాష్‌కామ్ కెమెరాలను ట్రాఫిక్ పోలీసుల పెట్రోలింగ్ వాహనాల ముందు భాగంలో అమర్చుతున్నారు. వాహనం ప్రయాణిస్తూనే చుట్టుపక్కల వెళ్తున్న వాహనాలను ఈ కెమెరాలు నిరంతరం స్కాన్ చేస్తాయి. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి వారి వాహన నంబర్‌ను ఆటోమేటిక్‌గా నమోదు చేస్తాయి. కెమెరా సేకరించిన సమాచారం నేరుగా ట్రాఫిక్ పోలీసుల సర్వర్, రవాణా శాఖ డేటాబేస్‌కు చేరుతుంది. అక్కడ వాహన వివరాలను ధృవీకరించిన తర్వాత సంబంధిత యజమానికి ఈ-చలానా స్వయంచాలకంగా జారీ అవుతుంది.

దీంతో ప్రతి జంక్షన్ వద్ద భారీగా పోలీసు సిబ్బందిని మోహరించాల్సిన అవసరం తగ్గడంతో పాటు, చలానాల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారనుంది. ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు హైదరాబాద్‌లోని నాలుగు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు నెలల పాటు పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. నాలుగు ఇన్నోవా పెట్రోలింగ్ వాహనాల్లో డ్యాష్‌కామ్‌లను అమర్చి క్షేత్రస్థాయిలో పరీక్షలు చేపట్టగా, ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు.

అంతేకాకుండా, ఇరుకైన వీధుల్లో తిరిగే ట్రాఫిక్ పోలీసుల ద్విచక్ర వాహనాలపై కూడా ఈ కెమెరాలను అమర్చి మరో దశలో పరీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ డ్యాష్‌కామ్ వ్యవస్థ తయారీకి ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే ఖర్చవుతుందని పరిశోధకులు వెల్లడించారు. తక్కువ వ్యయంతో అధిక సామర్థ్యం కలిగిన ఈ సాంకేతికతను నగరవ్యాప్తంగా అమలు చేస్తే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు తగ్గడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలను కూడా గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *