Headlines

ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? మీ రోజును మార్చేసే సింపుల్ అలవాట్లు ఇవే..! | Morning Vastu Tips: Follow These Simple Rituals for Positivity, Peace and Prosperity


Morning Vastu Tips Telugu: ఉదయం మన రోజంతా ఎలా సాగబోతుందో నిర్ణయించే కీలక సమయం. రోజును ప్రశాంతంగా, సానుకూల ఆలోచనలతో ప్రారంభిస్తే మనసుకు ఉత్సాహం, శరీరానికి శక్తి, పనిలో ఏకాగ్రత పెరుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. వాస్తు శాస్త్రం, భారతీయ సంప్రదాయాల్లో కూడా ఉదయపు వేళ పాటించాల్సిన కొన్ని సులభమైన అలవాట్లను పేర్కొన్నారు. ఇవి పెద్దగా సమయం తీసుకోవు. అయితే వాటిని నిత్యజీవితంలో భాగం చేసుకుంటే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, మనసుకు ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం.

హస్త దర్శనం.. భూమాతకు నమస్కారం

ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని క్షణాల పాటు మీ అరచేతులను చూసుకోవడం భారతీయ సంప్రదాయంలో ఒక మంచి ఆచారంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం అరచేతిలోని వివిధ భాగాల్లో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, శ్రీమహావిష్ణువు కొలువై ఉంటారని చెబుతారు. అందుకే రోజును మంచి ఆలోచనలతో ప్రారంభించేందుకు హస్త దర్శనం చేస్తారు. అనంతరం మంచం దిగే ముందు భూమిని తాకి నమస్కరించడం ద్వారా భూమాత పట్ల గౌరవం, కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు.

సూర్యుడికి అర్ఘ్యం.. మనసుకు ప్రశాంతత

ఉదయం స్నానం చేసిన అనంతరం రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటిని తీసుకుని సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం కూడా సంప్రదాయంలో ముఖ్యమైన ఆచారం. ఇది రోజును క్రమశిక్షణతో ప్రారంభించే అలవాటును పెంపొందిస్తుందని నమ్ముతారు. అనంతరం ఇంటి పూజా మందిరంలో దీపం వెలిగించి, రెండు నుంచి ఐదు నిమిషాల పాటు కళ్లు మూసుకుని భగవంతుని ధ్యానం చేయడం లేదా నామస్మరణ చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

ఇవి కూడా చదవండి



తులసి పూజ.. ప్రధాన ద్వారం పరిశుభ్రత

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం తులసికి నీరు పోసి, భక్తితో పూజించడం శుభప్రదంగా భావిస్తారు. అదే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వాస్తు విశ్వాసాల ప్రకారం ప్రధాన ద్వారం వద్ద చెత్త, పాడైన వస్తువులు లేదా అనవసర సామగ్రి పేరుకుపోకుండా చూసుకోవడం మంచిదని చెబుతారు. శుభ్రమైన ప్రవేశ ద్వారం ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది.

పక్షులకు ఆహారం.. సానుకూల ఆలోచనలు

ఉదయం బాల్కనీలో లేదా ఇంటి ఆవరణలో పక్షుల కోసం కొద్దిగా ధాన్యం, తాగునీరు ఉంచడం కూడా మంచి అలవాటే. మూగ జీవుల పట్ల ప్రేమ, దయ చూపడం మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ అన్ని ఆచారాలను పాటించాల్సిన అవసరం లేదు. మీ సమయం, సౌకర్యాన్ని బట్టి వీటిలో ఒకటి లేదా రెండు అలవాట్లతో ప్రారంభించవచ్చు.

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఉదయం మొదటి క్షణాలను తొందర, ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలతో కాకుండా ప్రశాంతంగా గడపడం. మంచి ఆలోచన, చిన్న ప్రార్థన, కృతజ్ఞత భావం లేదా కొన్ని నిమిషాల ధ్యానం కూడా రోజంతా మన మానసిక స్థితిపై సానుకూల ప్రభావం చూపగలదు. అందుకే ప్రతి ఉదయాన్ని కొత్త ఆశతో, సానుకూల దృక్పథంతో ప్రారంభిద్దాం.

(Disclaimer: ఈ కథనంలోని సమాచారం వాస్తు శాస్త్రం, మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడింది. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన విషయాలుగా పరిగణించరాదు. వ్యక్తిగత నమ్మకాలను బట్టి మాత్రమే ఆచరించాలి.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *