Headlines

ఏ దేవుడిని ఏ సమయంలో పూజిస్తే మంచిది? సూర్యుడు నుంచి లక్ష్మీదేవి వరకు ప్రత్యేక పూజా వేళలు ఇవే! | Best Time to Worship Different Hindu Gods: From Surya Dev to Goddess Lakshmi


Hindu puja timings Telugu: హిందూ సంప్రదాయంలో దేవుడిని పూజించడానికి కచ్చితంగా ఇలాంటి సమయమే ఉండాలనే నియమం లేదు. భక్తితో, మనస్ఫూర్తిగా ఎప్పుడైనా భగవంతుడిని స్మరించవచ్చు. అయితే సంప్రదాయ విశ్వాసాల ప్రకారం కొన్ని దేవతల పూజకు కొన్ని సమయాలు మరింత అనుకూలంగా ఉంటాయని చెబుతారు. ఆ సమయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య భగవానుడిని ఉదయం వేళ పూజించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా తెల్లవారుజామున సుమారు 4:30 నుంచి ఉదయం 6 గంటల మధ్య సూర్యారాధన చేయడం మంచిదని విశ్వాసం. ఇదే సమయం శ్రీరాముడు, శ్రీ వేంకటేశ్వర స్వామి పూజకు కూడా అనుకూలంగా ఉంటుందని చెబుతారు.

ఇక పరమశివుడి పూజకు ఉదయం 6 గంటల నుంచి 7:30 గంటల మధ్య సమయం మంచిదని కొందరి నమ్మకం. అయితే శివారాధనకు ఉదయం మాత్రమే కాదు, సాయంత్రం వేళ కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయం, అంటే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో శివుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు.

ఆంజనేయ స్వామి పూజకు మధ్యాహ్న సమయం అనుకూలమని సంప్రదాయ విశ్వాసం. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆయన కరుణా కటాక్షాలు లభిస్తాయని చెబుతారు.

ఇవి కూడా చదవండి



అలాగే రాహు గ్రహానికి మధ్యాహ్నం 3 గంటల సమయం అనుకూలంగా భావిస్తారు. లక్ష్మీదేవి పూజకు మాత్రం సాయంత్రం వేళకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదమని నమ్మకం.

శ్రీమహావిష్ణువును బ్రహ్మముహూర్తంలో స్మరించడం ఎంతో మంచిదని చెబుతారు. ముఖ్యంగా తెల్లవారుజామున ప్రశాంతమైన సమయంలో విష్ణుమూర్తిని ధ్యానించడం వల్ల మనశ్శాంతి, ఆధ్యాత్మిక ప్రశాంతత కలుగుతాయని విశ్వాసం.

అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. దేవుడిని పూజించడానికి సమయాల కంటే భక్తి, విశ్వాసం ముఖ్యమైనవి. నిర్ణీత సమయంలో పూజ చేయలేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. మనకు వీలైన సమయంలో, స్వచ్ఛమైన మనసుతో భగవంతుడిని స్మరించినా అదే గొప్ప పూజ అని ఆధ్యాత్మిక భావన చెబుతోంది.

(Disclaimer: ఈ కథనంలోని అంశాలు ప్రధానంగా సంప్రదాయ విశ్వాసాలు, ఆధ్యాత్మిక ఆచారాల ఆధారంగా చెప్పబడిన సమయాలు మాత్రమే. పూజలో సమయం కంటే భక్తి, నిష్ఠ ముఖ్యమని భావిస్తారు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *