Headlines

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద మరికొందరు.. మోదీ దిగ్భ్రాంతి! | Delhi Building Collapse: 3 Dead, 11 Rescued After Multi Storey Building Collapses in Satya Niketan


Delhi Satya Niketan building collapse: ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం భారీ విషాదం చోటుచేసుకుంది. బేస్‌మెంట్‌తో పాటు ఐదు అంతస్తులు ఉన్న పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భవనం నేలమట్టం కావడంతో ఏం జరిగిందో అర్థంకాక స్థానికులు, చుట్టుపక్కల నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ, ఢిల్లీ పోలీసులు, ఎంసీడీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్రేన్లు, జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తూ అందులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 11 మందిని సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. అయితే శిథిలాల కింద ఇంకా ఎంత మంది చిక్కుకున్నారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం.

పీజీ వసతి గృహంగా భవనం

ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలో ఈ భవనం ఉండటంతో ఇందులో పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 75 పడకల సామర్థ్యంతో పీజీ వసతి గృహంగా భవనాన్ని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. కింది భాగంలో మెడికల్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 20 మంది విద్యార్థులు భవనంలో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

బేస్‌మెంట్‌లో మరమ్మతులే కారణమా?

ప్రమాదం జరిగిన సమయంలో భవనం బేస్‌మెంట్‌లో మరమ్మతులు, నిర్మాణ పనులు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కురుస్తున్న వర్షాల కారణంగా బేస్‌మెంట్‌లోకి నీరు చేరిందని, దీంతో భవనం పునాది బలహీనపడటమే కూలిపోవడానికి కారణమై ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే భవనం కూలిపోవడానికి అసలు కారణం ఏమిటన్నది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఈ భవనం సుమారు 50 ఏళ్ల నాటిదని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా భవనం బలహీనంగా ఉందని నెల రోజుల క్రితమే అధికారులు నోటీసులు ఇచ్చినట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. దీంతో నోటీసులు ఇచ్చిన తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? భవనాన్ని ఖాళీ చేయించారా? నిర్మాణ, మరమ్మతు పనులకు అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

ఘటనాస్థలికి సీఎం రేఖా గుప్తా.. సీరియస్ వార్నింగ్

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తారన్‌జీత్ సింగ్ సంధు సహా పలువురు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పరిశీలించి అధికారుల నుంచి పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిథిలాల తొలగింపు, సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యగా భవనం పక్కనే ఉన్న మరో నివాస భవనాన్ని కూడా అధికారులు ఖాళీ చేయించారు. బాధితులను ఆసుపత్రిలో పరామర్శించనున్నట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఘటనకు బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలిపారు.

తీవ్ర ఆవేదనకు గురిచేసిందంటూ ప్రధాని మోడీ ట్వీట్

‘ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో భవనం కుప్పకూలిన ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు అవసరమైన సహాయం అందిస్తున్నారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *