Headlines

Asia Cup 2026: మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో మళ్లీ ట్రోఫీ రచ్చ తప్పదా?.. నఖ్వీ రాకతో టీమిండియాకు కొత్త టెన్షన్ | Mohsin naqvi womens asia cup 2026 final trophy controversy india


Asia Cup 2026: 2025 పురుషుల ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నీ ముగిసి దాదాపు ఏడాది కావోస్తున్నా నాటి విజయవంతమైన ట్రోఫీ ఇప్పటివరకు టీమిండియా చేతికి దక్కలేదు. నాడు ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా బహుమతి తీసుకోవడానికి భారత జట్టు సున్నితంగా నిరాకరించింది. ఆ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నఖ్వీ, ట్రోఫీని నేరుగా వేదిక నుంచి తన వెంట తీసుకెళ్లిపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆనాటి నుంచి నేటి వరకు భారత పురుషుల క్రికెట్ జట్టు ఆ అధికారిక విజేతల ట్రోఫీ లేకుండానే ఉంది.

మహిళల ఫైనల్‌కూ నఖ్వీ రాక

పాకిస్థాన్ మీడియా సంస్థ జియో సూపర్ సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 13న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మహిళల ఆసియా కప్ ఫైనల్ పోరుకు మొహసిన్ నఖ్వీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ప్రస్తుతం గ్రూప్ దశ ముగింపునకు రాగా, భారత్, శ్రీలంక జట్లు ఇప్పటికే సెమీఫైనల్ బెర్తులు ఖాయం చేసుకున్నాయి. సెప్టెంబర్ 10న జరగనున్న సెమీఫైనల్‌లో భారత్ విజయం సాధించి ఫైనల్‌కు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ భారత్ ఛాంపియన్‌గా నిలిస్తే, మళ్లీ ప్రెజెంటేషన్ వేదికపై నాటి నాటకీయ పరిణామాలే పునరావృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకుంటారా?

భారత మహిళల జట్టు టోర్నీలో అత్యంత బలమైన జట్టగా బరిలోకి దిగి వరుస విజయాలతో దూసుకుపోతోంది. గ్రూప్ లీగ్‌లో సాధించిన ఘనవిజయాల బలంతో భారత్ ట్రోఫీ గెలిచేందుకు ప్రధాన పోటీదారుగా నిలిచింది. ఒకవేళ హర్మన్‌ప్రీత్ సేన కప్ గెలిస్తే, మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా బహుమతిని స్వీకరిస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో పురుషుల జట్టు అనుసరించిన వైఖరినే మహిళా క్రికెటర్లు కూడా అనుసరిస్తే, వేదికపై మరోసారి తీవ్ర గందరగోళం చోటుచేసుకునే అవకాశం ఉంది.

మరోసారి వేడెక్కిన క్రీడా రాజకీయం

క్రీడల్లో రాజకీయ జోక్యం, ముఖ్యంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయాల తీరుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏసీసీ అధ్యక్షుడిగా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన నఖ్వీ, తన పంతాన్ని నెగ్గించుకోవడానికి చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఫైనల్ రోజు మ్యాచ్ ఫలితంతో పాటు వేదికపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *