Headlines

పొరపాటున వేరే నంబర్‌కు రీఛార్జ్ చేశారా.. నో టెన్షన్.. ఇలా చేస్తే డబ్బులు వెనక్కి.. | Did You Recharge the Wrong Mobile Number, Here Is How to Get Your Money Back


డిజిటల్ చెల్లింపుల యుగంలో మొబైల్ రీఛార్జ్ చేయడం సెకన్ల పనిగా మారింది. అయితే కొన్నిసార్లు తొందరపాటులోనో లేదా అజాగ్రత్త వల్లనో ఒక అంకె తప్పుగా నమోదై, వేరే ఎవరికో రీఛార్జ్ అయిపోతుంటుంది. డబ్బులు కట్ అయ్యాక గానీ మనకు ఆ విషయం తెలియదు. ఇలాంటి సమయాల్లో చేతులెత్తేసి ఆందోళన చెందకుండా.. వెంటనే అప్రమత్తమైతే తప్పు నంబర్‌కు వెళ్లిన సొమ్మును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు, ప్రక్రియలు తెలుసుకోవడం ఎంతో అవసరం. మీరు తప్పు నంబర్‌కు రీఛార్జ్ చేసిన వెంటనే చేయాల్సిన మొదటి పని.. ఆ లావాదేవీని ఏ మాధ్యమం ద్వారా పూర్తి చేశారో గుర్తించడం. మీరు మీ సిమ్ కార్డ్ ఆపరేటర్ అధికారిక యాప్ ద్వారా నేరుగా రీఛార్జ్ చేసి ఉంటే, రీఫండ్ పొందేందుకు లేదా ఆ రీఛార్జ్‌ను రద్దు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లించి ఉంటే మాత్రం రీఫండ్ ప్రక్రియ కాస్త కష్టంగా మారుతుంది.

ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు వేగంగా స్పందించడం అత్యంత కీలకం. ఉదాహరణకు.. మీరు జియో వినియోగదారులై ఉండి పొరపాటున వేరొక నంబర్‌కు రీఛార్జ్ పంపితే, నిర్ణీత గడువులోగా కస్టమర్ కేర్‌ను సంప్రదించి లావాదేవీని క్యాన్సిల్ చేసేందుకు రిక్వెస్ట్ పెట్టవచ్చు. సదరు నంబర్ వాడుకలో లేకపోయినా లేదా ఆ ప్యాక్ ఇంకా యాక్టివేట్ కాకపోయినా రీఫండ్ వేగంగా లభిస్తుంది. కాబట్టి క్షణం ఆలస్యం చేయకుండా అధికారిక యాప్‌లోని హెల్ప్, సపోర్ట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కంప్లైంట్ నమోదు చేయాలి.

ఫిర్యాదు చేసే సమయంలో లావాదేవీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీ, సమయం, పొరపాటున రీఛార్జ్ అయిన తప్పు నంబర్, మీ అసలు నంబర్ వంటి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. మీరు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే.. మీ డబ్బు వెనక్కి వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి తలనొప్పులు రాకుండా ఉండాలంటే పేమెంట్ బటన్ నొక్కే ముందు మొబైల్ నంబర్‌లోని పది అంకెలనూ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడమే అన్నింటికంటే ఉత్తమమైన మార్గం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *