Headlines

Pakistan Cricket: అవమానించి మెడపట్టి బయటకు పంపేశారు.. పాక్ బోర్డుపై మాజీ కోచ్ సంచలన ఆరోపణలు | Jason gillespie exposes pakistan cricket board aaqib javed unpaid dues


Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్గత వ్యవహారాలపై ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ టెస్టు కోచ్ జేసన్ గిలెస్పీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు ఇంకా వేలాది డాలర్లు బాకీ పడ్డారని, బోర్డులో ఆకిబ్ జావేద్ పెత్తనం వల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. పాకిస్థాన్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో క్రికెట్‌ను సరైన బాటలో పెట్టాలని జేసన్ గిలెస్పీ భావించారు. పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ ఆధ్వర్యంలో ఆకిబ్ జావేద్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. జట్టు ఎంపిక, వ్యూహాలు, మద్దతు సిబ్బంది నిర్ణయాల్లో కోచ్‌గా తనకు ఉన్న సర్వాధికారాలను ఒక్కొక్కటిగా లాగేసుకున్నారు. మొదట్లో వ్యూహరచనలో కీలక పాత్ర పోషించిన తనకు, ఆ తర్వాత ఏ విషయంలోనూ నిర్ణయం తీసుకునే అధికారం లేకుండా చేశారని గిలెస్పీ ఆవేదన వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన నైతిక విలువలను దెబ్బతీసేలా ప్రవర్తించిందని గిలెస్పీ స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం తనకు చెల్లించాల్సిన వేలాది డాలర్ల పరిహారాన్ని పీసీబీ ఇప్పటివరకు చెల్లించలేదని వెల్లడించారు. తానేమీ జీతం కోసం తల ఊపే రకం కాదని, నమ్మిన సూత్రాల కోసం ఎప్పుడూ రాజీపడలేదని గట్టిగా చెప్పారు. ఈ చేదు అనుభవాలు తనను మానసికంగా ఎంతో కృంగదీశాయని, అసలు కోచింగ్ వృత్తిలోనే ఉండాలా వద్దా అనే సందేహాలు కలిగేలా చేశాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పీసీబీ డైరెక్టర్ ఆఫ్ హై పెర్ఫార్మెన్స్‌గా ఉన్న ఆకిబ్ జావేద్‌పై గిలెస్పీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మొదట్నుంచి ఆయన తన వెనుక గోతులు తవ్వుతూ, ప్రతి విషయంలోనూ ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. పీసీబీ ఛైర్మన్ అండదండలు ఉండటంతో ఆకిబ్ జావేద్ తనను తాను సర్వాధికారిగా భావించేవారని, ఇతర వ్యక్తుల అభిప్రాయాలకు అక్కడ ఏమాత్రం విలువ లేదని తెగేసి చెప్పారు. తనపై ఆకిబ్ నిరంతరం ప్రతికూల ప్రచారం చేస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడనని హెచ్చరించారు.

ఏసీ గదుల్లో కూర్చునే బోర్డు అధికారులు, ఛైర్మన్లు కలిసి కెప్టెన్‌ను ఎంపిక చేయడం ఏంటని గిలెస్పీ ప్రశ్నించారు. సరైన కోచ్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చి, జట్టును పునర్నిర్మించే అవకాశం ఇస్తేనే క్రికెట్ ముందుకు వెళ్తుందన్నారు. ప్రస్తుతం పీసీబీ ఒక అస్తవ్యస్తమైన వాతావరణంలో ఉంంది, ఆకిబ్ జావేద్ లాంటి వ్యక్తులు ఉన్నంతకాలం పాకిస్థాన్ క్రికెట్ మరింత దిగజారిపోవడం ఖాయమని హెచ్చరించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *