మధుమేహం నేడు ఒక మహమ్మారిలా విస్తరిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి 100 మందిలో 30 మందికి మధుమేహం ఉన్నట్లు గత కొన్ని సంవత్సరాల గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడటం డాక్టర్ల చేతిలో కాదు, మీ చేతుల్లోనే ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహార నియమాలు పాటిస్తే షుగర్ రాకుండా చేసుకోవచ్చని, వచ్చిన వారు కూడా దీనిని నియంత్రించవచ్చని అంటున్నారు.
మధుమేహానికి ప్రధాన కారణం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం. ఈ చక్కెర స్థాయిలను పెంచేవి పిండి పదార్థాలు .మనం ఎంత ఎక్కువ పిండి పదార్థాలు తింటే, అంత ఎక్కువ చక్కెర రక్తంలో తయారవుతుంది. ఈ చక్కెరను పని రూపంలో ఖర్చు చేయకపోతే, అది రక్తంలో పేరుకుపోయి షుగర్ వ్యాధికి దారితీస్తుంది. ప్రోటీన్లు, కొవ్వుల విషయంలో కాకుండా, పిండి పదార్థాల విషయంలోనే మొదట ఆలోచించి తీసుకోవాలని అంటున్నారు.
మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సూర్యుడి గమనంపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ మంతెన వివరించారు. ఉదయం 8-9 గంటల నుండి ఇన్సులిన్ ఉత్పత్తి ప్రారంభమై, మధ్యాహ్నం 11 గంటల నుండి 1 గంట వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత, ఇన్సులిన్ ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కాబట్టి, ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అయ్యే సమయంలో ఆహారం తీసుకుంటే, అది రక్తంలోని చక్కెరను సమర్థవంతంగా కణాల్లోకి చేర్చి శక్తిగా మారుస్తుంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ గట్టిగా తినాలి. వారంలో కనీసం ఐదు నుండి ఆరు రోజులు ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్ల వంటి వాటికి బదులుగా మొలకలు, కొబ్బరి ముక్కలు, పల్లీలు, ఫ్రూట్స్ (రేక్కాయలు, జామకాయ, దానిమ్మ గింజలు, నేరేడు, పైనాపిల్ ముక్కలు) వంటివి తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. శని, ఆదివారాల్లో టిఫిన్లు తినాలనుకుంటే, మైదా కాకుండా మిల్లెట్స్ తో చేసినవి, ప్రోటీన్ అధికంగా ఉండే గారెలు, వడలు, పెసరట్లు, మినప ఆవిరి కుడుములను తినాలని చెబుతున్నారు.
డిన్నర్ మానేసిన వాళ్లు మధ్యాహ్న భోజనాన్ని మూడు గంటలకు పుష్టిగా తినాలని అంటున్నారు. ఈ భోజనంలో పుల్కాలు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రొట్టెలు రెండు తీసుకోవచ్చు. ఆకుకూరలో పప్పు వేసి వండుకోవచ్చు. వెజిటేబుల్ కర్రీలో శనగలు, బఠానీలు, బొబ్బర్లు, రాజ్మా వంటి గింజలు వేయించుకొని తీసుకోవడం వల్ల ప్రోటీన్, ఫైబర్ అధికంగా అందుతాయి. కావాలనుకుంటే, మిల్లెట్స్ అన్నం కొద్దిగా పెట్టుకొని పెరుగుతో తినవచ్చు. ఇన్సులిన్ అధికంగా ఉన్న మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.




