Headlines

Telangana: తాయత్తుల బాబా.. పూజల పేరుతో ఏం చేశాడో తెలిస్తే.. | POCSO Case Filed Against Astrologer Pendem Satish in Luxettipet Over Minor Harassment


ఉన్నత చదువులు చదివాడు.. ఆస్ట్రాలజీలో డిప్లొమా కూడా చేశాడు. అదే చదువును ఆసరాగా చేసుకుని జ్యోతిష్యం, వాస్తు పేరుతో ప్రజలకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత తాయిత్తులు కట్టడం మొదలు పెట్టాడు. అక్కడితో ఆగకుండా దెయ్యాలను వదిలిస్తానని.. భూత వైద్యం చేస్తానని నమ్మించాడు. అంతే అమాయక ప్రజలు ఆ బాబా బుట్టలో పడ్డారు. ఇంకే అమాయక ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని తనకంటూ ఓ దందా షురూ చేశాడు. షార్ట్‌కట్‌లో అన్ని వచ్చేస్తాయన్న మత్తులో బాబాగా అవతారం ఎత్తాడు. కానీ.. ఓ 13 ఏళ్ల బాలిక విషయంలో చేసిన దారుణంతో అసలు బండారం బయటపడింది.

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి రోడ్.. ఇదే తాయిత్తుల బాబా అలియాస్ పెండెం సతీష్ అడ్డా. సతీష్ బీఎస్సీ చదివాడు. ఆస్ట్రాలజీలో డిప్లొమా కూడా చేశాడు. ఆ తర్వాత జ్యోతిష్యం, వాస్తు శాస్త్ర నిపుణుడిగా ప్రచారం చేసుకున్నాడు. రోగాలు తగ్గిస్తానని.. దెయ్యాలు వదిలిస్తానని.. భూత వైద్యం చేస్తానని నమ్మించడం మొదలుపెట్టాడు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు తాయిత్తులు కట్టడం.. ప్రత్యేక పూజలు చేయడం ఇలా అతని కార్యకలాపాలు సాగించాడు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఓ కుటుంబం తమ 13 ఏళ్ల కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈ నెల 8న సతీష్ వద్దకు తీసుకువచ్చింది. దగ్గరి బంధువులు చెప్పడంతో అతని వద్దకు వెళ్లిన ఆ కుటుంబాన్ని సతీష్ నమ్మించాడు. నిమ్మకాయలతో పూజలు చేసి.. తాయిత్తులు కట్టి పంపించాడు. కానీ బాలిక ఆరోగ్యంలో మార్పు కనిపించలేదు. దీంతో కుటుంబం మరోసారి సతీష్‌ను ఆశ్రయించింది.

పూజ గదిలో ఏం జరిగింది..?

ఈసారి ప్రత్యేక పూజ చేయాలని చెప్పిన సతీష్.. బాలికను ఒంటరిగా పూజ గదిలోకి తీసుకెళ్లాడు. పూజకు అవసరమైన సామాగ్రి తీసుకురావాలంటూ బాలిక తండ్రిని బయటకు పంపించాడు. ఆ సమయంలో బాలికతో సతీష్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంతలో తండ్రి తిరిగి రావడం.. బాలిక కేకలు వేయడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. బాలికను వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు.. ఇంటికి వెళ్లిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు.

ఆగ్రహంతో బంధువుల దాడి..

కూతురు జరిగింది చెప్పడంతో కుటుంబసభ్యులు సతీష్‌పై దాడికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ కావడంతో పెండెం సతీష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించారు.

విచారణలో మరిన్ని సంచలన విషయాలు..?

సతీష్‌ గతంలోనూ ఇలాంటి ఆరోపణలు ఉన్నాయా..? మరెవరైనా బాధితులు ఉన్నారా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. జ్యోతిష్యం నుంచి తాయిత్తులు.. అక్కడి నుంచి భూత వైద్యుడి వరకు సతీష్ నకిలీ బాబా దందా కొనసాగినట్టు తేలింది. అక్కడితో ఆగకుండా తన రక్షణ కోసం ఓ యూట్యూబ్ మీడియాలో రిపోర్టర్‌గా కూడా అవతారం ఎత్తినట్టుగా పోలీసులు తేల్చారు. రోగాలు నయం చేస్తానని.. దెయ్యాలను వదిలిస్తానని చెప్పి అమాయక ప్రజలను నమ్మించేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. భూత వైద్యం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడన్న ఆరోపణలపైనా పోలీసులు దృష్టి సారించారు. అయితే గతంలోను మైనర్ బాలికలు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని కానీ బయటకి చెప్తే ఏం జరుగుతుందో అన్న భయంతో బాధితులు మౌనంగా ఉండిపోయారని సమాచారం.

ప్రజలకు పోలీసుల హెచ్చరిక

అనారోగ్యానికి వైద్య చికిత్స తీసుకోకుండా మంత్రాలు, తాయిత్తులు, భూత వైద్యం అంటూ నకిలీ వైద్యులను ఆశ్రయించవద్దని పోలీసులు సూచించారు. ముఖ్యంగా చిన్నారుల విషయంలో ఇలాంటి వ్యక్తుల మాటలను నమ్మి వారిని ఒంటరిగా పంపకూడదని హెచ్చరించారు. మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేసే వారిపై సమాచారం ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *