Headlines

ప్రధాని మోదీ దౌత్యం.. ఇటు పుతిన్‌తో దోస్తీ. అటు జిన్‌పింగ్‌తో మాటామంతీ.. మధ్యలో అమెరికాతో సర్దుబాటు! | BRICS Summit 2026: PM Modi’s Big Power Game – India’s Strategic Diplomacy with Russia, China, US


ఇప్పుడు ప్రపంచ దేశాల చూపంతా ఢిల్లీపై పడింది. ఒకవైపు రష్యా అధ్యక్షుడు వ్వాదిమిర్ పుతిన్‌, మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌. ఇద్దరితోనూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలకంగా మాట్లాడబోతున్నారు. అదే సమయంలో అమెరికాతోనూ భారత్‌ తన స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఒకరి కోసం ఇంకొకరిని వదిలేయడం లేదు. దేశానికి ఎక్కడ ఏది అవసరమో, అక్కడ దాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందినకాడికి అందిపుచ్చుకోవాలనే సామెతలా అన్ని వైపులా తలుపులు తెరిచి ఉంచుతోంది. ఇదే ఇప్పుడు ఢిల్లీలో కనిపిస్తున్న అసలు లెక్క.

ఢిల్లీ వేదికగా బ్రిక్స్‌ సదస్సు..

BRICSలో భారత్‌, రష్యా, చైనా సహా 11 దేశాలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో పెద్ద భాగం ఈ దేశాల్లోనే ఉంది. ప్రపంచ వ్యాపారంలోనూ వీటి వాటా గణనీయంగా ఉంది. అందుకే ఢిల్లీలో జరుగుతున్న సమావేశం మామూలు మీటింగ్‌ కాదు. యుద్ధాలు, చమురు ధరలు, వ్యాపారం, టెక్నాలజీ, అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలు.. ఇలా ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఎన్నో అంశాలపై ఇక్కడ చర్చ జరగనుంది. ముఖ్యంగా.. అమెరికా, యూరప్‌ దేశాల మాటలతో పాటు మిగతా దేశాల గొంతుక కూడా ప్రపంచంలో బలంగా వినిపించాలన్నది BRICSలోని ప్రధాన ఆలోచన.

పుతిన్‌తో మోదీ భేటీ..

ముందుగా పుతిన్‌తో మోదీ భేటీ అయ్యారు. రష్యా భారత్‌కు పాత మిత్రదేశం. దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఆయుధాల విషయంలో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు దానికి చమురు కూడా తోడైంది. 2026 జూలైలో భారత్‌ దిగుమతి చేసుకున్న ముడి చమురులో సుమారు 50.83 శాతం రష్యా నుంచే వచ్చింది. అంటే రోజుకు దాదాపు 24.7 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు భారత్‌కు వచ్చింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం, చమురు సరఫరాపై ఆందోళన ఉన్న సమయంలో ఇది భారత్‌కు చాలా కీలకం. అయితే పుతిన్‌తో మోదీ చర్చలు చమురుతోనే ఆగిపోవు. రష్యా నుంచి చమురు, ఎరువులు, ఇతర ఇంధన ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న భారత్‌.. అక్కడికి మన మందులు, కెమికల్స్‌, యంత్రాలు, ఆహార వస్తువులు, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు మరింతగా పంపాలని చూస్తోంది. 2030 నాటికి రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని 100 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యం ఉంది. అంటే..రష్యా నుంచి చమురు కొనడమే కాదు. రష్యా మార్కెట్‌లో మన సరుకులు అమ్ముకోవడం కూడా ముఖ్యం.

రక్షణ రంగంలోనూ ఇదే లెక్క..!

ఒకప్పుడు రష్యాపైనే ఎక్కువగా ఆధారపడిన భారత్‌, ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాలతోనూ ఆయుధాల విషయంలో కలిసి పనిచేస్తోంది. అయినా రష్యాతో పాత బంధాన్ని మాత్రం వదులుకోవడం లేదు. బ్రహ్మోస్‌ వంటి ప్రాజెక్టులు దీనికి ఉదాహరణ. కొత్త ఆయుధాలు, కలిసి తయారీ, కొత్త టెక్నాలజీ, అణుశక్తి. ఇలా రష్యాతో ఇంకా చాలా విషయాల్లో కలిసి పనిచేసే అవకాశం ఉంది. అంటే.. పాత స్నేహం కొనసాగుతూనే కొత్త దారులు కూడా చూసుకుంటోంది భారత్‌.

హర్మూజ్‌ టెన్షన్‌..!

మధ్యప్రాచ్యంలో యుద్ధం ఎక్కువైతే చమురు సరఫరాకు ఇబ్బంది రావచ్చు. హర్మూజ్‌ ప్రాంతంలో ఏ చిన్న అడ్డంకి వచ్చినా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆ దెబ్బ భారత్‌పైనా పడుతుంది. అందుకే రష్యా నుంచి వచ్చే చమురు భారత్‌కు మరో ముఖ్యమైన దారిగా మారుతోంది. పైగా BRICSలో ఇరాన్‌, UAE వంటి చమురు దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చమురు సరఫరా ఆగకుండా ఎలా చూడాలి? ధరలు పెరగకుండా ఏం చేయాలి? అనే విషయాలు కూడా ఈ సమావేశంలో ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది.

జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ..

పుతిన్‌ తర్వాత అందరి చూపు మోదీ-జిన్‌పింగ్‌ భేటీపైనే. దాదాపు ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్‌ భారత్‌కు వస్తున్నారు. గల్వాన్‌ ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు సరిహద్దులో పరిస్థితులు కొంత చక్కబడుతున్నాయి. మళ్లీ రెండు దేశాల మధ్య మాటామంతీ ఎంతవరకు పెరుగుతుందన్నదే ఆసక్తికరం. సరిహద్దులో ప్రశాంతత ఉండాలి. సైనికుల మధ్య మాటలు కొనసాగాలి. మళ్లీ గొడవలు రాకూడదు. ఇదే భారత్‌ ముందున్న ముఖ్యమైన విషయం. అయితే చైనాతో సమస్య బోర్డర్‌తోనే ముగియదు. అసలు పెద్ద తలనొప్పి వ్యాపారంతోనే ఉంది.

2025-26లో చైనా నుంచి భారత్‌ సుమారు 131.63 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులు కొనుక్కుంది. కానీ భారత్‌ నుంచి చైనాకు వెళ్లిన వస్తువుల విలువ కేవలం 19.47 బిలియన్‌ డాలర్లు. అంటే చైనాతో మన వ్యాపారంలో దాదాపు 112.6 బిలియన్‌ డాలర్ల లోటు ఉంది. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే.. చైనా నుంచి మనం చాలా కొంటున్నాం. కానీ మన దగ్గర నుంచి చైనా మాత్రం తక్కువగా కొంటోంది. అందుకే చైనా మార్కెట్‌లో మన మందులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఐటీ సేవలు, ఇంజినీరింగ్‌ వస్తువులు, కార్ల విడిభాగాలకు మరింత చోటు కావాలని భారత్‌ కోరుతోంది. చైనా కంపెనీలకు మన మార్కెట్‌ ఎంత ముఖ్యమో, మన కంపెనీలకూ అక్కడి మార్కెట్‌ అంతే అందుబాటులో ఉండాలన్నది ఢిల్లీ పెద్దల ఆలోచన. ఇక్కడే భారత్‌-చైనా సంబంధంలోని అసలు చిక్కు కనిపిస్తుంది. చైనా మనకు పోటీదారు, పెద్ద వ్యాపార భాగస్వామి కూడా. బోర్డర్‌లో జాగ్రత్త. వ్యాపారంలో అవసరం. చెట్టు ఒకటి.. నీడ రెండు అన్న చందాన రెండు వైపులా లెక్క చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అమెరికాతో స్నేహం..!

ఇక ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా కూడా చాలా ముఖ్యం. రష్యా నుంచి మనకు చమురు, ఆయుధాలు కావాలి. చైనాతో బోర్డర్‌ సమస్యలు ఉన్నాయి. అమెరికాతో టెక్నాలజీ, పెట్టుబడులు, సెమీకండక్టర్లు, రక్షణ రంగాల్లో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే భారత్‌ ఎవరి వైపూ పూర్తిగా వెళ్లడం లేదు. మనకు ఏది అవసరమో, అది ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తీసుకుంటోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఎవరి దగ్గర ఏ పని ఉందో.. ఆ పని వాళ్లతోనే అన్న తీరులో వ్యవహరిస్తోంది. రష్యాతో ఒక లెక్క. చైనాతో మరో లెక్క. అమెరికాతో ఇంకో లెక్క. కానీ చివరికి చూసేది మాత్రం భారత ప్రయోజనమే.

BRICSను వ్యతిరేకంగా మార్చొద్దు

ఇదే ఆలోచన BRICSలోనూ కనిపిస్తోంది. రష్యా, చైనా లాంటి దేశాలు పాశ్చాత్య దేశాలకు ఎదురుగా BRICSను బలమైన కూటమిగా చూడాలనుకుంటున్నాయి. భారత్‌ మాత్రం దాన్ని అమెరికాకు వ్యతిరేకంగా నిలబెట్టాలని అనుకోవడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలు ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే వేదికగా BRICS బలపడాలని భారత్‌ కోరుకుంటోంది. చమురు, ఆహారం, టెక్నాలజీ, వ్యాపారం, పెట్టుబడులు.. ఇలాంటి విషయాల్లో ఈ దేశాలకు ఉపయోగపడేలా BRICS పనిచేయాలన్నది ఢిల్లీ లెక్కగా ఉంది.

డాలర్‌కు మరో దారి డిజిటల్‌ రూపాయి

ఇక మరో ఆసక్తికరమైన విషయం డాలర్‌. ప్రపంచ దేశాల మధ్య పెద్ద లావాదేవీలు ఎక్కువగా డాలర్‌లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు BRICS దేశాలు తమ తమ దేశాల డబ్బుతోనే ఒకరితో ఒకరు వ్యాపారం చేసుకునే అవకాశాలపై ఆలోచిస్తున్నాయి. డిజిటల్‌ చెల్లింపులు కూడా ఇందులో భాగమే. భారత్‌ ఒక్కరోజులో డాలర్‌ను పక్కన పెట్టాలని అనుకోవడం లేదు. కానీ డాలర్‌ లేకపోయినా అవసరమైతే డబ్బు పంపుకునే మరో దారి ఉండాలని చూస్తోంది. ఇందులో డిజిటల్‌ రూపాయి ఉపయోగపడొచ్చు. అంటే..రేపే డాలర్‌కు బదులు మరో కరెన్సీ వస్తుందని కాదు. అవసరమైతే ఉపయోగించుకునే మరో దారిని ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవడం. మొత్తంగా చూస్తే బ్రిక్స్‌ వేదికగా భారత్‌ చాలా పనులు ఒకేసారి చక్కబెట్టుకోవాలని చూస్తోంది.

రష్యా నుంచి చమురు, ఎరువులు, ఆయుధాల సహకారం కావాలి. చైనాతో బోర్డర్‌లో ప్రశాంతత కావాలి. వ్యాపారంలో మనకు న్యాయం జరగాలి. అమెరికా నుంచి టెక్నాలజీ, పెట్టుబడులు, రక్షణ సహకారం కావాలి. BRICS ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన మాటకు విలువ పెరగాలి. దేశాల మధ్య డబ్బు పంపుకోవడానికి కొత్త దారులు కూడా సిద్ధం కావాలి. ఒకరిని వదిలి ఇంకొకరి దగ్గరకు వెళ్లడం కాదు. ఎవరి దగ్గర మనకు ఏం అవసరమో, అది తీసుకోవడం.

చివరిగా…

పుతిన్‌తో చమురు. జిన్‌పింగ్‌తో సరిహద్దు, వాణిజ్యం. అమెరికాతో టెక్నాలజీ, పెట్టుబడులు. BRICSతో ప్రపంచంలో మన మాట. మూడు వైపులా మూడు పనులు. కానీ చివరి లెక్క మాత్రం ఒక్కటే. భారత ప్రయోజనం. అదే ఇప్పుడు ఢిల్లీ వేదికగా మోదీ ఆడుతున్న ‘బిగ్ పవర్ గేమ్‌’ అని చెప్పాలి.

కొండవీటి శివనాగరాజు
డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *