ఉదయం లేవగానే పొగలు కక్కే వేడి టీ లేదా స్ట్రాంగ్ కాఫీ గొంతులోకి దిగితే కానీ చాలామందికి రోజు గడవదు. వర్షం పడినా, కాస్త అలసటగా అనిపించినా మరుగుతున్న టీ, కాఫీలు గుటకలేయడం మనలో చాలామందికి నిత్య అలవాటు. అయితే ఈ అలవాటే మన శరీరంలో అత్యంత కీలకమైన భాగాన్ని నిశబ్దంగా నాశనం చేస్తోందని వైద్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డ్రింక్ ఏదైనా.. అతి వేడిగా తాగే అలవాటు ప్రాణాంతక క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
అన్నవాహికపై ఉష్ణ ఒత్తిడి.. ఏం జరుగుతుందంటే?
మరుగుతున్న వేడి ద్రవాలు నేరుగా గొంతులోకి దిగినప్పుడు, నోటి నుంచి కడుపు వరకు ఆహారాన్ని చేరవేసే అన్నవాహిక తీవ్రమైన ఉష్ణ నష్టానికి గురవుతుంది. అన్నవాహిక లోపలి గోడలు అత్యంత సున్నితమైన కణాలతో నిర్మితమై ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత ఉన్న ద్రవాలు పదేపదే తగిలినప్పుడు ఆ కణాలు తీవ్రమైన ఒత్తిడికి గురై కాలిపోతాయి. అప్పుడప్పుడు వేడిగా తాగితే శరీరం దాన్ని సరిచేసుకుంటుంది. కానీ రోజుకు నాలుగైదు సార్లు, ఏళ్ల తరబడి ఇదే విధంగా అతి వేడిగా తాగడం వల్ల ఆ ప్రాంతంలోని కణజాలంలో జన్యుపరమైన మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది.
అన్నవాహిక క్యాన్సర్‌తో సంబంధం
క్రమం తప్పకుండా తీవ్రమైన వేడితో ఉండే పానీయాలు సేవించడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు శాస్త్రీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. వేడి టీ తాగే ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందని చెప్పలేకపోయినప్పటికీ, ఇది క్యాన్సర్‌ను ప్రేరేపించే ఒక ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్‌గా వైద్యులు గుర్తిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది టీ లేదా కాఫీ గుణాన్ని కాదు.. అవి గొంతులోకి దిగేటప్పుడు ఉండే ఉష్ణోగ్రతను మాత్రమే.
టీ తాగడం మానేయక్కర్లేదు.. ఈ చిన్న మార్పు చాలు
ఈ హెచ్చరికల ఉద్దేశం టీ, కాఫీలను పూర్తిగా మానేయాలని కాదు. మన రోజువారీ తాగే పద్ధతిలో ఒక చిన్న జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది.
రెండు నిమిషాలు ఆగండి: టీ, కాఫీలు స్టవ్‌పై నుంచి దించగానే లేదా కప్పులో పోయగానే నేరుగా తాగేయకుండా, కనీసం 3 నుంచి 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి.
గోరువెచ్చగా లేదా మితమైన వేడి: పానీయం కొద్దిగా చల్లారి, తాగడానికి అనువైన మితమైన ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత మాత్రమే ఆస్వాదించాలి.
తరచుగా తాగేవారు జాగ్రత్త: ముఖ్యంగా రోజుకు ఎక్కువసార్లు వేడి పానీయాలు సేవించే అలవాటు ఉన్నవారు, ఉష్ణోగ్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
ఆరోగ్యకరమైన జీవితానికి భారీ వ్యాయామాలు, కఠినమైన డైట్‌లే కాదు.. మనం ప్రతిరోజూ చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవడం కూడా అంతే ముఖ్యం.