Headlines

AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సెప్టెంబర్‌ నుంచి వరుసగా APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు | Andhra Pradesh Job Calendar 2026: Total 3,168 Posts Notification on September 15, More in October

AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సెప్టెంబర్‌ నుంచి వరుసగా APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు | Andhra Pradesh Job Calendar 2026: Total 3,168 Posts Notification on September 15, More in October


అమరావతి, జులై 29: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జాబ్ క్యాలెండర్‌-2026 అమలుపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. జాబ్ క్యాలెండర్‌-2026లో భాగంగా మొత్తం 10,060 పోస్టులను నాలుగు దశల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగనుంది. తొలి దశలో మొత్తం 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేశారు.

రెండో దశలో 3,168 పోస్టులకు సెప్టెంబర్‌ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ దశ నోటిఫికేషన్‌లో ఆలస్యం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు నోటిఫికేషన్ తేదీలో మార్పు చేసినట్లు వెల్లడించారు. మూడో దశలో 2,388 పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. నాలుగో దశలో 2,981 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మూడో, నాలుగో దశలకు సంబంధించిన నోటిఫికేషన్లు అక్టోబర్‌ 15న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక హోంశాఖలో ఖాళీగా ఉన్న 2,225 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్‌, భద్రతా విభాగాల్లో అవసరమైన సిబ్బంది నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 పోస్టుల పెంపుపై పరిశీలన

గ్రూప్‌-1 పోస్టుల సంఖ్య పెంపు అంశంపై మంత్రుల బృందం అభిప్రాయాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఆలస్యం లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. అలాగే జాబ్ క్యాలెండర్‌-2026లో భాగంగా పూర్తి స్థాయి ఖాళీల వివరాలను వచ్చే కేబినెట్‌ సమావేశానికి అందించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *