Headlines

Asian Games 2026: ఆసియా గేమ్స్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్ | Pratika rawal replaces injured jemimah rodrigues indian squad asian games 2026


Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026 ప్రారంభానికి ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ టోర్నీకి దూరమయ్యారు. ఆమె స్థానంలో యువ టాప్ ఆర్డర్ బ్యాటర్ ప్రతికా రావల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. గత నెలలో జరిగిన ది హండ్రెడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్ తరఫున ఆడుతున్న సమయంలో జెమిమా తొడ కండరాల గాయానికి గురయ్యారు. ఈ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఆమె ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్‌తో పాటు రాబోయే ఆసియా క్రీడలకు కూడా దూరమయ్యారు. మిడిలార్డర్‌లో కీలకమైన జెమిమా లేకపోవడం జట్టు యాజమాన్యానికి పెద్ద సమస్యగా మారింది. జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్ కోసం బీసీసీఐ సమర్పించిన 15 మంది సభ్యుల తుది జాబితాలో జెమిమా స్థానాన్ని ప్రతికా రావల్‌తో భర్తీ చేసినట్లు బీసీసీఐ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి.

ఇంగ్లాండ్‌లో వార్విక్‌షైర్ తరఫున వన్డే కప్‌లో ఆడేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ప్రతికా రావల్‌కు అనుకోకుండా ఆసియా కప్, ఆసియా గేమ్స్ పిలుపులు వచ్చాయి. ప్రస్తుత ఆసియా కప్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న ప్రతికా 22, 10, 4 పరుగులు చేశారు. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు చీలమండ గాయంతో మైదానానికి దూరమైన ఈ యువ ప్లేయర్, చాలా కాలం తర్వాత మళ్లీ పోటీ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. గాయం కారణంగానే ఆమె 2026 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సీజన్‌ను కూడా కోల్పోవాల్సి వచ్చింది. గత వేలంలో ఆమెను యూపీ వారియర్స్ రూ. 50 లక్షలకు దక్కించుకుంది.

ఆసియా గేమ్స్‌లో మహిళల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు జరగనున్నాయి. గత ఎడిషన్ ఫైనల్లో శ్రీలంకను 19 పరుగుల తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించిన భారత జట్టు, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఈ ఆసియా క్రీడల టోర్నీలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, జపాన్, థాయిలాండ్, మలేషియా, చైనా జట్లు పాల్గొంటున్నాయి. నాకౌట్ దశలకు ముందు ప్రతికా రావల్ తన బ్యాటింగ్ ఫామ్‌ను అందుకోవాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.

ఆసియా గేమ్స్ 2026 భారత మహిళల తుది స్క్వాడ్

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, ప్రతికా రావల్, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి కమలిని (వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, ప్రేమా రావత్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, ఎన్ శ్రీ చరణి, నందిని శర్మ.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *